కలలను అదుపు చేసే పరిమళాలు...శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి

సోమవారం, 24 నవంబరు 2014 (18:02 IST)
ఎటుంటి మూడ్‌నయినా సువాసనభరిత పరిమళాలు ఇట్టే మార్చేస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే సువాసనలు కలలను అదుపు చేస్తాయంటే నమ్మగలరా... అవును అంటున్నారు పరిశోధకులు.
 
కలలు నిజం కాకపోయినా ఆ కొద్దిసేపటికి నిజంలా అనిపిస్తాయి. పిల్లల నుంచి పెద్దల దాకా అందర్నీ ఈ కలలు తన మాయాజాలంలో పడేస్తాయి. ఒక్కోసారి భయంకరమైన కలలు భయపెడితే, ఇంకోసారి మంచి కలలు హాయినిస్తాయి. కల కలేనని తెలిసినా ఎందుకో కలలు కూడా మంచివే రావాలని కోరుకుంటాం.
 
కానీ కలల్ని మనమెలా శాసిస్తాం చెప్పడి. మంచివి మాత్రమే రావాలని, చెడ్డ కలలు రాకూడదని కదా! కానీ, కొంతవరకు ప్రభావితం అయితే చెయ్యచ్చు అంటున్నారు జర్మనీకి చెందిన పరిశోధకులు.
 
మనకొచ్చే కలలు మనం పీల్చే వాసనల మీద ఆధారపడి వుంటాయట. అంటే, మంచి వాసనలను పీల్చినప్పుడు పాజిటివ్ కలలు, చెడు వాసనలు పీల్చినప్పుడు నెగటివ్ భావాల కలలు వస్తాయిట. జర్మనీ పరిశోధకులు కొంతమందిపై పరిశోధన చేసినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
నిద్రపోతున్న వారు అత్యధిక గాఢత కలిగిన మంచి, చెడు వాసనలను పీల్చేలా చేసి, వారి కలల్లో తలెత్తే మార్పుల్ని పరిశీలించారు హీడెల్ బర్గ్ యూనివర్సిటీ పరిశోధకులు. వాసన అందించే ప్రేరణను బట్టి కలల్లో మార్పులు రావడం గుర్తించారు.
 
శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో భాగంగా మంచి నిద్రలో ఉన్నవారికి కుళ్ళిన కోడిగుడ్ల వాసన చూపించారట. దాంతో ఆ వాసన పీల్చినప్పుడు వారికి ప్రతికూల భావాలుండే కలలు రావడం గమనించారు. 
 
అలాగే గులాబీ పూల సువాసన పీల్చేలా చేసినప్పుడు సానుకూలమైన కలలు రావడం గుర్తించారు ఈ అధ్యయనంలో. వాసనలు... అవి కలలపై చూపించే ప్రభావం గురించి ఇంతటి పరిశోధన ఎందుకు అంటే వారి సమాధానం ఏంటో తెలుసా? కొంతమందిపై అనవసరమైన ఉద్వేగాల్ని, అయిష్టాల్ని పెంచుకునే వారికి మానసిక స్వాంతన చేకూర్చడానికి అన్నారు. 
 
అంటే ఏ వాసనలకి వారు ఎలా స్పందిస్తున్నారో వారి కలలని బట్టి గుర్తించవచ్చు. దాంతో వారి మానసిక భావోద్వేగాలని సువాసనల ద్వారా నియంత్రించడానికి ప్రయత్నించవచ్చు అంటున్నారు పరిశోధకులు.
 
సహజంగా కొందరిలో తెలియని భయాలు, అయిష్టాలు ఉంటాయి. వాటిని పోగొట్టుకోవడం ఎలాగో తెలీక ఇబ్బందిపడతారు. అలాంటి వారికి ‘వాసనల’తో వాటిని నియంత్రించడానికి ప్రయత్నించవచ్చు అన్నది ఆ పరిశోధన సారాంశం. ఆ దిశగా మరింత పరిశోధన జరుగుతోంది ఇంకా. 
 
సువాసనల ద్వారా మంచి భావాలు పెంపొందించేందుకు వీలయితే అంతకన్నా కావలసినది ఏముంటుంది చెప్పండి. ప్రస్తుతానికైతే కలలతో సరిపెట్టుకుందాం. కనుక... ఈరోజు నుంచి నిద్రపోయే గదిలో మంచి గులాబీల సువాసనలు వచ్చేలా చూసుకోండి. మంచిమంచి కలలలో తేలిపోండి.

వెబ్దునియా పై చదవండి