ఏకాగ్రతా రహస్యం అంటే ఏంటి? అదెలా సాధ్యం?

సోమవారం, 20 ఫిబ్రవరి 2017 (13:24 IST)
విద్యార్థుల జీవితంలో కీలక ఘట్టం వార్షిక పరీక్షలు. వచ్చే నెలలో ఈ పరీక్షలు జరుగనున్నాయి. అయితే, చదువుకు సంబంధించిన ప్రధాన సాధనం మనసు. మానసిక సంసిద్ధత ఉంటేనే బుద్ధినీ, నైపుణ్యాలనూ సద్వినియోగం చేయడం సాధ్యమవుతుంది. మానసిక సంసిద్ధత అంటే పరీక్షలకు సంబంధించిన వివిధ అంశాలపై మనసులో స్పష్టమైన అవగాహన ఏర్పరచుకుని ఏకాగ్రతతో కార్యాన్ని పూర్తి చేయడం. 
 
ఏకాగ్రత అంటే చేసే పనిమీద మనసు లగ్నం కావటం. చదివేటప్పుడు వేరే ఆలోచనలు మనసులోకి వస్తూవుంటే ప్రయోజనం పూర్తిగా పొందలేము. అంతరాయాలు లేకుండా చూసుకోవడం అసాధ్యం కాబట్టి అంతరాయాలనూ, వాటి ప్రభావాన్నీ అతి తక్కువగా ఉండేలా చూసుకోవడమే ఏకాగ్రతా రహస్యం. 
 
ఖచ్చితంగా అనుకున్న పని చేయాలన్న సంకల్పం ఏకాగ్రతకు మూలం. చేయాల్సిన, చేయగలిగిన పని మీద దృష్టి ఉంచడం మానేసి చేయలేకపోయిన పనుల గురించీ, వృథా అయిన కాలం గురించీ ఆందోళన చెందడం వల్ల ఏకాగ్రత కుదరదు. ధ్యానం/ప్రార్థన మానసిక ప్రశాంతతకు ఉపకరిస్తుంది. అనవసర ఆందోళనను తగ్గించడం వల్ల ఏకాగ్రతకు దోహదపడుతుంది. 

వెబ్దునియా పై చదవండి