అదంతా అప్పుడు సిల్లీగా ఏదో జరిగిపోయిందంటోంది... ఏం చేయాలి?

గురువారం, 9 మే 2019 (17:36 IST)
నేను కాలేజీ చదివే రోజుల్లో నా క్లాస్‌లో చదివే అమ్మాయి నాతో చనువుగా ఉండేది. ఫైనల్ ఇయర్ చదివేటపుడు ఇక కాలేజీ నుంచి వెళ్తామనగా నన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది. ఆమె ప్రపోజల్‌ను అప్పుడు తిరస్కరించా. ఇపుడు ఆమె ఓ మంచి కంపెనీలో స్థిరపడింది. నేను కూడా ఆమె కంపెనీకి ప్రక్కనే ఉన్న మరో కంపెనీలో ఉద్యోగంలో చేరాను. ఓసారి రోడ్డుపై కనబడి హాయ్ అని పలుకరించి వెళ్లిపోయింది. ఆమె చాలా అందంగానూ, స్టయిల్‌గా మారిపోయింది. 
 
ఆమెతో మాట్లాడాలని రోజూ రోడ్డుపై పడిగాపులు కాస్తుంటాను. ఈమధ్య ఓరోజు హాయ్ చెప్పి టీకి పిలిచాను. ఆమె కాదనకుండా వచ్చింది. అప్పుడు గతం తాలూకు జ్ఞాపకాలు, ఆమె నాకు చేసిన లవ్ ప్రపోజల్ గురించి గుర్తు చేశాను. ఆమె దాని గురించి కొద్దిగా కూడా పట్టించుకోలేదు. అదంతా అప్పుడు సిల్లీగా ఏదో జరిగిపోయిందని టీ తాగేసి వెళ్లిపోయింది. కానీ నాకు మాత్రం ఆమె కావాలనిపిస్తోంది. ఆమె వాలకం చూస్తుంటే నన్ను మాత్రం పెళ్లి చేసుకోదని అర్థమైపోయింది. ఆమెను ఎలాగైనా నా పట్ల ఆకర్షితురాల్ని చేయాలి.. కుదురుతుందా?
 
మీతో ఇక సమీప భవిష్యత్తులో మాట్లాడకపోవచ్చు. ఆమె మీపై ప్రేమ పెంచుకుని వ్యక్తపరిచినపుడు దూరం పెట్టేశారు. అంటే... అపుడు మీకు ఆమె నచ్చలేదు. ఇపుడు మంచి ఉద్యోగంలో స్థిరపడింది. ఇపుడు కూడా మీరు పిలిస్తే మిమ్మల్ని పట్టించుకోకుండా వెళ్లిపోవచ్చు. కానీ సాటి మనిషిగా మీతో టీ తాగేందుకు వచ్చింది. ప్రేమ గురించి ఇప్పుడు మీరు కొత్త కబుర్లు చెప్పినా ఆమె అనుభవంలో మీరు తనను కాదన్న వ్యక్తిగా మిగిలి ఉన్నారు. కాబట్టి మీరు ఇప్పుడు ఆమె నుంచి ప్రేమనే కాదు ఏదీ ఆశించజాలరు. ఆమెను పెళ్లాడాలన్న నిర్ణయం తీసుకుని వుంటే ఆ విషయాన్ని ధైర్యంగా చెప్పండి. ఎలాగూ మీరంటే తనకి ఇష్టం కనుక మీ విన్నపాన్ని పరిశీలిస్తుందేమో...?

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు