పాపాలను తొలిగించే పుష్కరిణి, కానీ అనుమతి లేదు.. మోక్షమెప్పుడంటే..?

శుక్రవారం, 18 జూన్ 2021 (17:57 IST)
శ్రీవారి సన్నిధిలో పుణ్యస్నానాలు ఆచరించే భాగ్యం ఇప్పట్లో లేదా...? కరోనా కారణంగా ఏడాదికిపైగా నిలిపివేసిన భక్తుల రాకపోకలు తిరిగి ప్రారంభం కావాలంటే ఇంకా సమయం పట్టునుందా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తే అవుననే సమాధానం వినబడుతోంది. కేసులు పెరుగుతుండటంతో టిటిడి కూడా ఆలోచనలో పడిపోయింది.
 
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవారి చెంతకు వచ్చే భక్తులు క్షేత్ర సంప్రదాయం ప్రకారం అనుసరించి స్వామివారిని దర్సించుకుంటూ ఉంటారు. పుష్కరిణిలో స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. అంతేకాదు వరాహస్వామి దర్సనం, మహాప్రసాద శ్రీకారంతో తిరుమల యాత్రకు సంపూర్ణత చేకూరుతుందన్న నమ్మకం.
 
భక్తులు ముందుగా స్వామివారి పుష్కరిణిలో స్నానం ఆచరించేందుకు ప్రాధాన్యత ఇస్తారు. కలియుగ వైకుంఠనాధుడి సన్నిధిలోని కోనేరులో స్వామి పుష్కరిణి అంటారు. శ్రీ మహావిష్ణువు ఆజ్ఙ మేరకు గరుత్మంతుడు స్వామిపుష్కరిణిని తీసుకువచ్చి ఈ క్షేత్రంలో స్ధాపించాడని పురాణాలు చెబుతున్నాయి.
 
ఇందులో స్నానం ఆచరిస్తే సర్వపాపాలు తొలగిపోతాయన్నది భక్తుల విశ్వాసం. 1468 సంవత్సరంలో సాలువ నరసింహరాయులు పుష్కరిణి మధ్య నీరాణి మండపాన్ని నిర్మించారు. 17వ శతాబ్ధంలో తాళ్ళపాక అన్నమయ్య కోనేరు మెట్లను నిర్మించారట. ఇక స్వామివారి పుష్కరిణిలో ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజుకు ముగిసేలా ఐదురోజులు పాటు తెప్పోత్సవాలను నిర్వహిస్తారు.
 
ప్రతియేటా వైకుంఠ ఏకాదశి తరువాత రథసప్తమిరోజున బ్రహ్మోత్సవాల్లో చివరిరోజున అనంత పద్మనాభస్వామి వ్రతం రోజున స్వామివారి పుష్కరిణిలో చక్రస్నానం కార్యక్రమం ఉంటుంది. అయితే కరోనా కారణంగా గత యేడాది మార్చి 17వతేదీ నుంచి భక్తులను పుష్కరిణిలోకి అనుమతించడం లేదు.
 
తరువాత భక్తులకు దర్శనభాగ్యం కలిగినా పుష్కరిణి మాత్రం తెరవలేదు. గత యేడాది కేంద్ర మార్గదర్సకాల మేరకు స్విమ్మింగ్ పూల్ వంటి ప్రాంతాలకు పర్యాటకులను అనుమతిస్తున్నా టిటిడి మాత్రం ముందస్తు చర్యల్లో భాగంగా పుష్కరిణిలో పుణ్యస్నానాలకు పర్మిషన్ ఇవ్వలేదు. ప్రస్తుతం తాత్కాలికంగా కొన్ని షవర్లను ఏర్పాటు చేసింది. అయితే కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టాక పుష్కరిణిలోకి భక్తులను అనుమతించాలన్న ఆలోచనలో ఉంది టిటిడి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు