మీ బీరువాలో లక్ష్మీదేవి వుందా? లేదా..?

సోమవారం, 22 మే 2017 (16:10 IST)
ఇంట్లో బీరువాని ఉంచే స్థలం, దిశకు మనపై లక్ష్మీదేవి చూపే అనుగ్రహానికి లంకె ఉందని తెలుసా? సాధారణంగా చాలామంది తాము ఉపయోగించే బట్టల్లో ఖరీదైనవి, ఇష్టమైనవి బీరువాలో కుక్కేసి, అంతగా ముఖ్యం కాదనుకునే పత్రాలను, డబ్బుని అక్కడక్కడా అల్మరాల్లో సర్దేస్తుంటారు. కానీ బీరువాలో ముఖ్యమైన కీలకపత్రాలను, బంగారం, డబ్బుని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ధనానికి చిహ్నమైనటువంటి వీటిని విసిరేసినట్లుగా, శ్రద్ధ లేకుండా పడేసినట్లు ఉంచుకుంటే అది లక్ష్మీదేవిని అవమానించినట్లేనని, అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి నివశించదని పండితులు చెప్తున్నారు.
 
లక్ష్మీదేవి కటాక్షం లభించాలంటే బీరువాని ఉంచే దిశ కూడా ఎంతో ముఖ్యం. బీరువాని ఇంట్లోని నైరుతి మూలలో ఉంచాలి. అలాగే బీరువా తెరిచినప్పుడు అది ఉత్తరం వైపు చూసేలా ఉండాలి. బీరువా తెరవగానే చక్కని సువాసన వచ్చేలా ఏవైనా సుగంధాలను, స్ప్రేలను చల్లి ఉంచాలి. బట్టలకు హాని కలగకుండా ఉంచే కలరా ఉండలు మాత్రమే కాకుండా ఆహ్లాదమైన సువాసనను వెలువర్చే సెంట్లు, పర్‌ఫ్యూమ్‌లను ఉపయోగించవచ్చు. ఎందుకంటే బీరువా తెరవగానే బట్టల మక్కి వాసనో, ఏవైనా కీటకాలు, వాటి గుడ్ల వాసనో వస్తే లక్ష్మీ అనుగ్రహం ప్రాప్తించదు.
 
బీరువాపైన ఒకవైపు పసుపు రంగులోని ఎర్రని బొట్లు పెట్టి ఉండి, సవ్యదిశలో ఉండే స్వస్తిక్ ముద్ర, మరోవైపు లక్ష్మీదేవి కూర్చుని ఉండి, చెరోవైపున తొండాలు ఎత్తిపెట్టుకుని ఉండే ఏనుగులు ఉండే బొమ్మని అతికిస్తే ఎంతో శ్రేష్టం. ఎంతో శుభానికి, సౌభాగ్యానికి గుర్తులైన ఈ రెండు బొమ్మలను బీరువాపై ఉంచుకుంటే ఆ ఇంట్లో కనకవర్షం కురుస్తుందని, లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం ప్రాప్తిస్తుంది.

వెబ్దునియా పై చదవండి