శ్రీరాముడి పుట్టిన రోజా లేదా పెళ్లి రోజా..?

బుధవారం, 21 ఏప్రియల్ 2021 (09:06 IST)
శ్రీరామ నవమి శ్రీరాముడి పుట్టిన రోజు. ఆ రోజు చైత్రశుద్ధ నవమి. మరి నిజంగా ఆరోజే సీతారాములకు పెండ్లి అయ్యిందా.. లేక కేవలం పుట్టినరోజా ఏ విషయమై పలువురి సందేహం. అయితే పండితులు చెప్పిన వివరాలు తెలుసుకుందాం. 
 
శ్రీరాముడు త్రేతాయుగంలో, చైత్రమాసం, వసంత ఋతువు శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకొంటారు. 
 
ఆ తర్వాత స్వామి విద్యాభ్యాసం, విశ్వామిత్ర మహర్షి కోరికతో స్వామి అరణ్యాలకు వెళ్లడం అక్కడ రాక్షసులను సంహరించడం ఆ తర్వాత జనకమహారాజు పెట్టిన శివధనస్సు పర్వంలో గెలవడం. ఆ తర్వాత సీతమ్మ తల్లిని పెండ్లిచేసుకోవడం అన్ని జరిగిపోయాయి. 
 
తర్వాత తీరా పట్టాభిషేకం చేస్తారనుకునే సమయంలో తండ్రి ఆన కోసం పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తర్వాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో అడుగిడినాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసం.
 
శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది అని కొందరి అభిప్రాయం. అయితే మనకు రామాయణంలో అసలు రామాయణం శ్రీవాల్మీకి రామాయణం. దీని ప్రకారం మార్గశిర మాస శుక్లపక్ష పంచమి నాడు జరిగింది. అందుకే జనకుని రాజ్యం అదేనండి నేటి నేపాల్‌లోని జనకుర్సి ప్రాంతంలో నేటికి మార్గశిరమాసంలో రామకళ్యాణం చేస్తుంటారు.
 
కనుక జన్మదినం, వివాహదినం మరియు రాజ్య పునరాగమనం కూడా నవమి రోజునే జరిగిందని పెక్కుమంది విశ్వాసం. అదండీ సంగతి. మహనీయుల జన్మదినాన వారి కళ్యాణం చేయడం ఆనవాయితీగా కూడా ఉంది.
 
అలా మన తెలుగునాట నవమినాడు శ్రీ సీతారాముల కళ్యాణం చైత్రశుద్ధ నవమినాడు చేయడం వందల ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం, పరంపర. పెద్దలు చేసినదానిని పవిత్రంగా భావించి శ్రీ సీతారాముల అనుగ్రహం పొందడమే మన కర్తవ్యం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు