ఒకనాడు ఓ చిరుతపులి కుక్కను కరవబోయేసరికి అది గోడుగోడున ఏడుస్తూ ముని దగ్గరకు పరుగెత్తుకొచ్చింది. ముని దయతలచి కుక్కను కూడా చిరుతపులి కింద మార్చేశాడు. అప్పుడు దాని ధాటికి ఆగలేక అంతకు మునుపొచ్చిన చిరుతపులి కాస్తా తోక ముడిచి కాలికి బుద్ధి చెప్పింది. అలా ఆ ముని కుక్కను దయతో ఆపదలో వున్నప్పుడల్లా రక్షిస్తూ అది ఏనుగును చూసి భయపడితే దానిని ఏనుగులా, సింహాన్ని చూసి పారిపోయి వస్తే దాన్ని సింహం కింద మార్చేసేవాడు.
ఒకనాడు శరభ మృగం ధాటికి భయపడి పారిపోయి వస్తే దాన్ని శరభంగా మార్చి అభయమిచ్చాడు. అలా రోజురోజుకూ పెద్ద జాతి మృగంగా మారుతుంటే కుక్కకు ఆనందం అవధుల్లేకుండా పోయేది. అయితే శరభ రూపంలో తిరుగుతున్న కుక్కకు ఓ సందేహం కలిగింది. శరభ రూపంలో వున్న నన్ను చూసి ఇంకో మృగమేదైనా భయపడి పారిపోయి ఈ ముని దగ్గరకు వస్తే దాన్ని కూడా శరభ మృగంగా మారుస్తాడేమో... అలా అయితే గర్వంగా తలెత్తుక తిరగడానికి నాకు వీలుండదు. కనుక ముందు ఈ మునిని హతమార్చాలి అనుకుంది.
శరీరమైతే శరభాకారంలో వుంది కాని బుద్ధులెక్కడికిపోతాయి. పూర్వ వాసనతో నీచమైన కుక్క బుద్ధి పోలేదు దానికి. ఆ ముని సామాన్యుడా... దివ్యశక్తులు కలవాడు. కుక్క మనసులోని దుర్మార్గపు ఆలోచన ఇట్టే కనిపెట్టేశాడు. నీచులకు ఉన్నత స్థితి తెలుస్తుందా.. ఇది కుక్కగా మారుగాక అన్నాడు. అంతే... అమాంతం అది కుక్కగా మారిపోయింది.