లౌకికమైన బంధాల్లో చిక్కుకున్న మనిషిని సంసారబంధనాల నుంచి విముక్తిడిని చేసి కైవల్యానికి మార్గం చూపే దారిదీపంగా భాగవతం నిలుస్తుందని, కేవలం భాగవతాన్ని వినటంతోనే ముక్తి లభిస్తుందని ప్రముఖ పండితులు, ప్రవచనకర్త బ్రహ్మశ్రీ మద్దులపల్లి దత్తాత్రేయశాస్త్రి అన్నారు.
భగవంతుడి లీలల్లో అనేకమైన అంతరార్థాలు దాగి ఉంటాయని, విచక్షణ కోల్పోయి వితండవాదంతో పరమాత్మ లీలల్ని ప్రశ్నించటం సరికాదన్నారు. అనంతమైన సాహిత్యాన్ని సృష్టించిన వ్యాసమహర్షికి సైతం భాగవత రచన వల్లే సాంత్వన చేకూరించదన్నారు.
భాగవతం కేవలం భగవంతుడి కథల సమాహారం మాత్రమే కాదని, అనంతమైన ఆధ్యాత్మిక, వైజ్ఞానిక విషయాలకు నిలయమని చెప్పారు. కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతీ మహాస్వామి శిష్యులు నారాయణేంద్ర సరస్వతీస్వామి, కైవల్యానంద సరస్వతి, శంకరానంద సరస్వతీస్వామి కూడా పాల్గొన్నారు.