గోవిందా? నీ హుండీలో రూ.500, రూ.1000 నోట్లు వేయమంటావా? వద్దా...? చెప్పవయ్యా...?
మంగళవారం, 15 నవంబరు 2016 (14:28 IST)
కేంద్ర ప్రభుత్వం 500, వెయ్యినోట్లు (పాతరూపంలోనివి) రద్దు చేయడంతో శ్రీవారి హుండీ ఆదాయం భారీగా పెరిగే అవకాశాలున్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు. దేశంలోని ఇతర ఆలయాల ఆదాయమూ పెరగవచ్చని చెబుతున్నారు. అలాంటి పరిస్థితి ఏమీ ఉండబోదని చెబుతున్న వారూ ఉన్నారు. కేంద్ర ద్రవ్య విధానంలో వస్తున్న మార్పుల ఫలితంగా ఇ-హుండీ ఆదాయం పెరిగే అవకాశముందని తితిదే అధికారులు అంచనా వేస్తున్నారు.
శ్రీవారికి వస్తున్న హుండీ కానుకల్లో స్వామివారిపై భక్తితో సమర్పించేవే ఉంటాయి. ఆదాయపు పన్ను భయంతోనో, ఇంకో ఆందోళనతోనో హుండీలో కానుకలు వేసే వారు నామమాత్రంగానే ఉంటారని చెప్పాలి. కానుకలనేవీ విశ్వాసాలతో ముడిపడినవి. తమ మ్రొక్కలు తీర్చుకునేందుకు నిలువు దోపిడీ (శరీరంపై ఉండే వస్త్రాలు, ఆభరణాలు సహా సమర్పించుకోవడం ) ఇచ్చేంతటి విశ్వాసం భక్తులది. భక్తితో ఎన్ని కోట్లయినా సమర్పించుకుంటారు గానీ భయంతో కాదు. అందుకే పెద్ద నోట్ల రద్దు ప్రభావం వల్ల అదనంగా శ్రీవారి హుండీకి కానుకలు వచ్చి చేరుతాయని భావించలేం. ఇంకో అంశాన్ని కూడా ఇక్కడ పరివీలించాలి. నల్లధనవంతులపై ప్రభుత్వం ఇప్పుడు కేసులు పెట్టడం తమ వద్ద ఉన్న పాతనోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసి పన్ను కట్టేస్తే మిగిలినది అధికారిక సొమ్ము (వైట్ మనీ)గా మారుతుంది. విధిలేని పరిస్థితి వస్తే పన్ను చెల్లించయినా బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకుంటారు. మినహా శ్రీవారికి హుండీగా సమర్పించే అవకాశం లేదు.
శ్రీవారికి హుండీకి పాతనోట్లు (రద్దయిన నోట్లు) వచ్చినా తితిదేకి పెద్ద ఇబ్బంది ఉండదు. స్థానిక బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో డిసెంబర్ 31వతేదీ లోపు పాత నోట్లు ఇచ్చి కొత్త నోట్లు తీసుకోవాలని రిజర్వు బ్యాంకు సూచించింది. అదే రిజర్వు బ్యాంకులతోనైతే మార్చి 31దాకా ఈ అవకాశం ఉంది. భక్తులు ఎవరైనా పాత నోట్లను స్వామి హుండీలో వేసినా తితిదేకి ఇబ్బంది లేదు. సాధారణంగా హుండీ లెక్కింపు పూర్తికాగానే డబ్బులను జాతీయ బ్యాంకుల్లో జమ చేసే విధానం ఉండడం వల్ల పాతనోట్లయినా, కొత్త నోట్లయినా ఇబ్బంది లేదు. భక్తులు తమ వద్ద ఉన్న పాత నోట్లను హుండీలో వేసినా తితిదే సులభంగానే మార్చుకోగలదు. ఈ పరిస్థితుల్లో మ్రొక్కుబడి ఉన్న వారు మార్చిలోపు స్వామివారిని దర్శించుకకుని పాతనోట్లను హుండీలో సమర్పించే అవకాశాలున్నాయి. ఆ తరువాత అయితే ఆ నోట్లను మార్చుకుని రావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ పనిని తితిదేనే చేసుకుంటుంది. భక్తులు తాము శ్రీవారి హుండీలో పాతనోట్లు వేస్తున్నామని అవి చెల్లబోవని భావించాల్సిన అవసరం లేదు.
తిరుమల వంటి ఆలయాలకు పాతనోట్లను మార్చుకునే గడువును కనీసం ఏడాదిపాటు కల్పిస్తే మరింత ప్రయోజనం కలిగే అవకాశముంది. డిసెంబర్ 31గడువు ముగిసిన తరువాత కూడా నోట్లు మార్చుకోవడానికి సాధ్యం కాని వాళ్లు ఎవరైనా ఉంటే ఆ మొత్తాలు హుండీకి చేర్చమని కోరవచ్చు. ఆ విధంగా బ్లాక్‌మనీ ప్రజాప్రయోగ కార్యకలాపాలకు ఉపయోగపడవచ్చు. నోట్ల కట్టలు ఎక్కడో మూలనపడి ఉండడం కంటే హుండీకి చేరి, ప్రజా అవసరాలకు దోహదపడటం మంచిదే కదా..! కేంద్రం అలాంటి అనుమతులు ఇస్తుందా అనేది అనుమానమే గానీ దాని వల్ల జనానికి ఎంతో కొంత మేలు జరిగే అవకాశముంది.
కేంద్రం కొత్తగా 2వేల రూపాయల నోట్లను ప్రవేశపెట్టడం వల్ల శ్రీవారికి వచ్చే కానుకల లెక్కింపు ఎంతో కొంత సులభమయ్యే అవకాశాలున్నాయి. పెద్ద మొత్తంలో కానుకలు సమర్పించే వారు. గతంలో 500, వెయ్యి రూపాయల నోట్లు వేసేవారు. ఇప్పుడు 2వేల రూపాయల నోట్లు వేస్తారు. దీని వల్ల లెక్కింపు శ్రమ కాస్తయినా తగ్గుతుంది. ఇదిలా ఉంటే క్యాష్ లెస్ ఆర్థిక లావాదేవీలను ప్రోత్సహించాలని (నోట్లతో పని లేకుండా..కార్డులు..ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా నగదు బదిలీలు ) కేంద్రం భావిస్తున్న నేపథ్యంలో శ్రీవారికి ఇ-హుండీ ద్వారా వచ్చే ఆదాయం పెరిగే అవకాశముంది. ఈ మేరకు సాంకేతికంగా ఇ -హుండీ వ్యవస్థను పటిష్టం చేయాలని ఇప్పటికే ఈఓ సాంబశివరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. పెద్ద నోట్లు రద్దు చేస్తున్న ప్రకటన వచ్చిన వెంటనే తితిదే దీనిపై సమీక్షించడం విశేషం.