మనమీనాడు దేశంలోని ఏ సాయి మందిరము దర్శంచినా, అక్కడ బాబా మూర్తిని భక్తులు మహరాజుగా అలంకరించి పూజించడం చూస్తాం. సాయికి నాల్గువేళలా ఆరతులు పాడడం, గురువారంనాడు వారి మూర్తిని, పాదుకలనూ రాజ లాంఛనాలతో ఊరేగించడం చూస్తాం. ఇందుకు కారణం యివన్నీ శిరిడీ సంస్థానంలో సాయికి జరిగే సేవలే. మొదట పేదభిక్షువుగా మాత్రమే జీవించిన సాయిని ప్రత్యక్షంగా పూజించడం, వారి మశీదును రాజదర్బారులా అలంకరించడము, ఆరతులు జరిపించడము - వీటన్నింటిని మొదట ఆరంభించినది భక్తురాలు రాధాకృష్ణ ఆయీ.
రాధాకృష్ణ ఆయీ మొదటిసారి నానా సాహెబ్ చందోర్కర్‌తో కలసి 1905లో పండరీపురం నుండి శిరిడీ వచ్చింది. ఆమె అసలు పేరు సుందరీబాయిక్షీర సాగర్, ఆమె తాత అహ్మద్ నగర్‌లో పేరు మోసిన న్యాయవాది. చిన్న వయసులోనే ఆమె భర్త మరణించాడు. అప్పటి నుండి ఆమె తన జీవితం పరమార్థం సాధనలో గడపదలచింది. త్వరలోనే తన బంధుకోటినిస కుటుంబాన్నీ విడచి వంటరిగా భగవంతుని సేవలో జీవితం గడపసాగింది. ఎంతో నిశితమైన తత్వ జ్ఞానము, ధ్యాన పద్ధతి నేర్చంది. చివరకు ఎన్నో జన్మల పుణ్యం వలన సాయి సన్నిధి చేరింది.
శిరిడీ వచ్చేనాటికి ఆమె మహ సౌందర్యవతియైన యువతి. మొదటి నుండి ఆమె కృష్ణ భక్తురాలు. నిరంతరమూ ఆమె రాధాకృష్ణ అనే నామం జపిస్తుండటం వలన ఆమెకు రాధాకృష్ణ అయీ అను పేరు వచ్చింది. ఆమెకు మధురమైన కంఠముండేది, ఎన్నో భజనలు, కీర్తనలు పాడేది. ప్రధమ దర్శనంలోనే ఆమె సాయి అనబడు మానవాకృతి మాటున దాగియున్న అనంత విశ్వశక్తిని గుర్తించింది. వారినే తన సద్గురువుగా, శ్రీకృష్ణుని ప్రత్యక్ష రూపంగా భావించి యావజ్జీవతమూ సేవించింది.
రాధాకృష్ణ ఆయీ ఆధ్యాత్మిక సాధనలో ఎన్నో మెలకువలు తెలిసిన వివేకి. ఆమె ఇంటిని సాయిశాల అనేవారు, అంటే పాఠశాల అని అర్థం. ఉత్తమమైన సాధక జీవితం నేర్పే పాఠశాలయే ఆమె ఇల్లు. ఆమె బాబా పట్ల తీవ్రమైన శ్రద్ధ, భక్తులతో పాటు విశిష్టమైన అధికారము, ఆకర్షణా వుండేవి. ఆమె ఏదైన చెబితే, కోటీశ్వరుడైన బూటీ దగ్గర నుండి అందరు తలవంచి ఆ పని చేసేవారు. సాయి నిత్యమూ ఎండలో నడిచి లెండికి వెళ్ళేవారు. కనుక ఆ దారి పొడుగునా, రెండువైపులా ఇనుప కమ్మెలు నాటి, వాటి ప్రక్కనే లతలు మొలిపించాలని సాటి భక్తులకు ఆమె చెప్పింది. అందరూ శ్రమించి ఆ పని పూర్తిచేసారు.