దక్షిణాదిలోని శివాలయాలలో పేరుగన్న ఆలయం కపిలతీర్థం వద్ద ఉన్న శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం. తిరుపతి నుండి తిరుమలకు వెళ్ళే దారిలో కపిలతీర్థం నెలకొని ఉన్నది. ఈ ఆలయం దర్శనం దైవదర్శనంతో పాటు చక్కటి జలపాతాన్ని వీక్షించడానికి కూడా వీలు కల్పిస్తున్నది. కపిల మహర్షి పేరిట ఆలయం వెలిసింది. అతని భక్తి త్యాగనిరతికి మెచ్చి శివపార్వతులు ఇక్కడ కపిలమహర్షికి దివ్యదర్శనం ప్రసాదించి, ఇక్కడే కొలువైనట్లు ఐతిహ్యం.
శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయ విశిష్టత : ఈ ఆలయం తిరుమల కొండ అడుగుభాగంలో ఉన్నది. శివ విష్ణు శక్తులకు కపిలతీర్థం ఆలయం ప్రతీక. కపిలేశ్వరుని దర్శించే సందర్భంగా భక్తులు పెద్ద నందిని కూడా దర్శిస్తారు. చుట్టూ పర్వతశ్రేణితో కూడి భక్తులకు ఆహ్లాదం కలిగించే ఆలయం కపిలేశ్వర ఆలయం. ఆలయ దర్శనం ఆధ్యాత్మికను పెంచగా, జలపాతంలో స్నానం శారీరక ఇబ్బందులను తొలగిస్తుంది.
విశేష దినాలు : తిరుపతి బ్రహ్మోత్సవం వేడుకలలో మునిగి ఉన్న సందర్భంలో శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం కూడా వేలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. శివరాత్రి సందర్భంగా కపిలేశ్వరుని సందర్శనార్థం వేలాది మంది భక్తులు ఆలయం వద్దకు చేరుకొంటారు. ఇక్కడ వినాయక ఉత్సవం, కార్తీకదీపం కూడా చాలా వేడుకగా జరుగుతాయి. దేవి నవరాత్రి ఉత్సవం, కామాక్షిదేవి చందన అలంకారం ఇక్కడ మరో విశేషం.