అంబరీషుడికి రాజ్యమెలా దక్కింది..?

శనివారం, 31 జనవరి 2015 (17:58 IST)
ఎవరికి ఏదీ దక్కాలో.. అదే వారికి దక్కుతుంది. ఆశ, ఆరాటంతో ఎలాంటి ప్రయోజనం ఉండదు. భగవంతుడు ఎవరికి ఏది నిర్ణయించాడో వారికి అది దక్కుతుంది. ఇదే విషయం విష్ణుభక్తుడైన అంబరీషుడి విషయంలోనూ స్పష్టమైంది. 
 
అంబరీషుడు శ్రీమహావిష్ణువును అనునిత్యం ఆరాధిస్తూ ఉండేవాడు. ఏది జరిగినా అది స్వామి లీలావిశేషంగానే భావించేవాడు. అలాంటి అంబరీషుడికి అయోధ్య సింహాసనం దక్కడం ఆయన సోదరుడైన చిత్రసేనుడికి ఇష్టం ఉండదు. దాంతో ఆస్థాన జ్యోతిష్యులచే నాటకమాడించి, సింహాసనం తనకి దక్కడమే మంచిదని తండ్రికి చెప్పిస్తాడు.
 
తాను రాజు కాగానే అంబరీషుడిని అడవులకు పంపిస్తాడు. తన పథకం ఫలించినందుకు సంతోషంతో పొంగిపోతాడు. అయితే ఎప్పుడైతే అంబరీషుడు రాజ్యాన్ని వీడాడో ఆ రోజు నుంచి అక్కడ వానలు కురవకుండాపోతాయి. పంటలు పండక ప్రజలు అనేక అవస్థలు పడుతుంటారు. అనుక్షణం శ్రీమన్నారాయణుడిని సేవించే అంబరీషుడు రాజ్యం వదిలిపోవడమే తమ దుస్థితికి కారణమని ప్రజలు గ్రహిస్తారు. ఆయన అడుగుపెడితేనే గాని తమ కష్టాలు తొలగిపోవని భావిస్తారు.
 
అంతా కలిసి అడవీ ప్రాంతంలో అన్వేషించి అంబరీషుడి జాడ తెలుసుకుని ఆయనకి నచ్చజెప్పి రాజ్యానికి తీసుకువస్తారు. చిత్రసేనుడు ప్రజల తీర్పును అంగీకరిస్తున్నట్టుగా ప్రకటించి అంబరీషుడికి క్షమాపణ చెప్పుకుంటాడు. అలా ఎవరెన్ని కుతంత్రాలు జరిపినా అంబరీషుడికి దక్కవలసిన రాజ్యం ఆయనకే దక్కుతుంది.

వెబ్దునియా పై చదవండి