విబూదిని ఎలా తయారు చేస్తారో తెలుసా? విబూదిని ధరిస్తే ప్రయోజనం ఏంటి?

గురువారం, 29 జూన్ 2017 (17:17 IST)
విబూది అంటే పవిత్ర భస్మం. ఇది ఐశ్వర్యకారకం. పాపాలను నశింపజేస్తుంది. చెట్టంత మనిషే కాదు. చెట్టు కాలినా చివరికి మిగిలేది మాత్రం భస్మమే. అయితే ఏ బూడిద అయినా విబూదేనా అంటే కానే కాదని చెప్పాలి. సాధారణంగా గోమయ భస్మాన్నే విబూదిగా చెప్తారు. ఆవు పేడను సేకరించి పిడకలు లేదా ఉండలుగా చేసి వాటిని ఆరబెడతారు. ఆ పేడలో దాదాపు 16 రకాల ఔషధగుణాలున్న ఆకులుంటాయి. 
 
ఈ పిడకల్ని ధాన్యపు పొట్టులోకానీ గడ్డితో కానీ అరలు అరలుగా పేర్చి మాసశివరాత్రి రోజున వేదమంత్రోఛ్ఛారణ మధ్య కాల్చుతారు. ఈ పద్ధతిని విరజహోమం అంటారు. కాలాక వాటిని తడిపి ఆరబెడతారు. దీన్ని దిమ్మలుగా చేసి.. విబూదిపండ్లుగా భక్తులకు అందజేస్తారు. విబూదిని ఎక్కువగా తమిళనాడు, కర్ణాటకల్లోని ఆలయాల్లో ఉపయోగిస్తారు. విబూదిని గుడుల్లో అనుసంధానమై వుండే గోశాలల్లో తయారుచేస్తుంటారు. 
 
అలాగే రకరకాల ఔషధమొక్కల్ని వాడి చేసే హోమాల నుంచి కూడా విబూదిని సేకరిస్తారు. హోమ భస్మంలో ఆవుపేడతో పాటు 108 మూలికలు, సుగంధ ద్రవ్యాలు, ఆవు నెయ్యి వుంటాయి. ఇవి అహాన్ని, కోరికలను అగ్నికి ఆహుతి చేశామన్న దానికి గుర్తుగా సాధువులు ధరిస్తుంటారు. విబూదిని ధరిస్తే.. అందులోని ఔషధ గుణాలు శరీరానికి మేలు చేస్తాయి అంటారు. 
 
పద్ధతి ప్రకారం ఉంగరపు వేలు, బొటనవేళ్లతో విబూదిని తీసుకుని కనుబొమల మధ్య, గొంతుమీద, ఛాతిమీద ఎక్కువగా ధరిస్తారు. విబూది ధారణతో ఆధ్మాత్మిక భావన పెరగడంతో పాటు అనారోగ్యాల నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చునని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి