కొబ్బరికాయ నిలువుగా పగిలితే ఏమవుతుంది?

శనివారం, 23 మే 2020 (20:01 IST)
గుడికి వెళ్లినా, పండుగలు చేస్తున్నా దేవున్ని పూజించేటప్పుడు కొబ్బరికాయ కొడతాం. హిందువులు కొబ్బరికాయకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. రామాయణ, మహాభారతాలలో కూడా టెంకాయకు గొప్ప ప్రాధాన్యత ఉంది. కొబ్బరికాయను మనిషి తలకి ప్రతీకగా భావిస్తారు. కొబ్బరికాయపై ఉండే పీచు మనిషి జుట్టు, గుండ్రని ఆకారం మనిషి ముఖం. కొబ్బరికాయలోని నీరు రక్తంతో పోలుస్తారు. ఇక కొబ్బరి లేదా గుజ్జు మనస్సును సూచిస్తాయి.
 
దేవునికి కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్లిపోతే మంచిదా లేక అపచారమా అనే సందేహం చాలా మంది వస్తుంది. ఇలా జరిగితే కీడు సంభవిస్తుందని ఆందోళనకు గురౌతారు. అయితే కొబ్బరికాయ కొట్టినప్పుడు అది బాగా తెల్లగా ఉన్నా, తీర్థం తియ్యగా ఉన్నా చాలా సంతోష పడతాం. అదే టెంకాయ కుళ్ళిపోతే కంగారు పడతాం. కొబ్బరికాయ పగిలే విధానం వివిధ పనులను సూచిస్తుంది.
 
కొబ్బరికాయ కొట్టినప్పుడు సమానంగా పగిలితే మనస్సులోని కోరిక నెరవేరుతుందని అర్థం. కొత్తగా పెళ్ళై వారు టెంకాయను కొట్టినప్పుడు మధ్యలో పువ్వు వస్తే సంతానప్రాప్తి లభిస్తుంది. అలాకాకుండా సాధారణంగా టెంకాయను కొట్టినప్పుడు పువ్వు వస్తే శుభమని అర్థం. టెంకాయ నిలువుగా పగిలితే ఆ కుటుంబంలోని కూతురుకి గానీ, కొడుకుకి గానీ సంతానం లభిస్తుందని సూచన.
 
టెంకాయ కుళ్ళిపోతే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. టెంకాయ కొట్టినప్పుడు కుళ్ళిపోతే అసలు ఏమీ కాదు. చింతించాల్సిన అవసరంలేదంటున్నారు జ్యోతిష్యులు. అయితే, ఇంట్లోగానీ, ఆలయంలోగానీ కొట్టిన టెంకాయ కుళ్ళిపోతే దానిని పారవేసి, చేతులు కాళ్లు కడుక్కుని మళ్లీ పూజ చేయాలి. వాహనానికి పూజ చేసి టెంకాయ కొట్టినప్పుడు కుళ్ళిపోతే ఆ వాహనానికి దిష్టి పోయిందని అర్థం. పండుగ రోజు దేవుడికి పూలు, టెంకాయ సమర్పిస్తే స్వీకరిస్తాడట. సమర్పించడం ముఖ్యం కానీ పొరపాటు జరిగితే ఎలాంటి దోషం అంటదట.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు