ప్రాప్తం అనేది కొంత మేరకే.. ఈర్ష్య, అసూయ, ద్వేషం ఉండకూడదు..

శనివారం, 25 ఏప్రియల్ 2015 (17:07 IST)
దేనికైనా ప్రాప్తం ఉండాలి అని మాటను పదే పదే వింటుంటాం. నిరాశ ఎదురైతే '' ఏం చేస్తాం .. మనకింత వరకే ప్రాప్తం వుంది'' అని నిట్టూర్చుతుంటారు. ప్రాప్తం అనేది కర్మఫలంపై ఆధారపడి వుంటుంది. పూర్వజన్మలో చేసిన పుణ్యకార్యాలను బట్టి ఎవరికి ఏది దక్కాలో ... ఎంతవరకూ దక్కాలో నిర్ణయం జరిగిపోతుంటుంది. ఒకరు ఎంతగా కష్టపడినా లభించనిది, మరొకరు తేలికగా పొందడానికి గల కారణం కూడా ఇదే. 
 
అయితే మనకింతవరకే ప్రాప్తం అని సరిపెట్టుకోవడమే అన్నివిధాలా మంచిది. ధనమైనా, అధికారమైనా, మరేదైనా సరే తమ సొంతమవుతుందని అనుకున్నది మరొకరికి దక్కినప్పుడు ఈర్ష్యా .. అసూయ .. ద్వేషం మొదలైనవాటిని ప్రదర్శించకూడదు. అలా చేయడం వలన ఆశించినది దక్కకపోగా, వున్న మనశ్శాంతి కూడా కరువవుతుంది.
 
భగవంతుడి అనుగ్రహాన్ని సంపాదించుకుని దాని సాయంతో అనుకున్నది సాధించవచ్చు. అలా కాకుండా ఈర్ష్యా .. అసూయ .. ద్వేషాలను పెంచి పోషిస్తే అవి అవతలవారికంటే ఎక్కువగా తమకే నష్టాన్ని కలగజేస్తుంటాయని గ్రహించాలి. అందుకే ఆశించినది ఎంతైనా .. అందులో దక్కింది కొంతే అయినా సంతోషించాలి ... సంతృప్తిచెందాలి. ఎవరికి ఎంత దక్కాలో అంతే దక్కుతుందని గ్రహించాలి.  

వెబ్దునియా పై చదవండి