తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ పదవి కోసం తెలుగుదేశం పార్టీలో అప్పుడే రగడ మొదలైంది. చైర్మన్ పదవి తనకే ఇవ్వాలని ఎంపీ రాయపాటి సాంబశివరావు పట్టుబడుతున్నారు. అవసరం అయితే ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఈ మేరకు రాయపాటి సాంబశివరావు పది రోజుల క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. అంతకుముందు కూడా రాయపాటి తనకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలంటూ పట్టుబట్టిన విషయం తెలిసిందే.
చిత్తూరు జిల్లాకు చెందిన చదలవాడ కృష్ణమూర్తికి ఆ ఛాన్స్ దక్కింది. దాంతో మరోసారి రాయపాటి పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. జీవితంలో ఒక్కసారైనా ఆ పదవి దక్కించుకోవాలని ఎదురుచూస్తున్న రాయపాటి సాంబశివరావుపై ఈసారి అయినా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి కటాక్షం లభిస్తుందో లేదో మరి.
ఇక టీటీడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తితో పాటు పాలకవర్గం పదవీ కాలం పూర్తి కావడంతో కొత్త పాలకవర్గాన్ని ప్రభుత్వాన్ని నియమించనుంది. కాగా ప్రస్తుతం చదలవాడ కృష్ణమూర్తి రాయలసీమ నేత కావడంతో ఈసారి టీటీడీ చైర్మన్ పదవి కోస్తా జిల్లాల వారికే కేటాయించాలని డిమాండ్ తెరమీదకు వస్తోంది. అధినేత చంద్రబాబు ఎవరి మొర ఆలకిస్తారో వేచి చూడాల్సిందే. అయితే ఇప్పటికే మురళీమోహన్‌కు దాదాపు ఆ పదవి ఖరారైనట్లు సామాజిక మాథ్యమాల్లో వార్తలొస్తున్నాయి.