తిరుమల తిరుపతి దేవస్థానంలో రెగ్యులర్ ఉద్యోగులు 9 వేల మంది ఉండగా అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో 13 వేల మందికిపైగా పనిచేస్తున్నారు. వీరంతా చాలీచాలని జీతాలతో బతుకుతున్నారు. పారిశుధ్య కార్మికుల నుంచి టెక్నీషియన్ల దాకా అన్ని స్థాయిల్లోను అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులున్నారు. వీరికి రూ.6,700, రూ.8,400, రూ.9,500, రూ.11,500 ఇలా నాలుగు రకాల వేతనాలు అమల్లో ఉన్నాయి. అత్యంత అట్టడుగున ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు నెలకు రూ.6,700 మంది మాత్రమే ఇస్తున్నారు. వేతనాలు పెంచమని చాలాకాలంగా కార్మికులు పోరాటం సాగిస్తున్నారు. కనీసం టైం స్కేలు ఇవ్వాలని అడుగుతున్నారు. ఇదే డిమాండ్‌తో ఇటీవల ఛలో హైదరాబాద్ నిర్వహించి ఇందిరాపా్కు వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికుల వేతనాలు రూ.2,500 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రూ.6,700 ఇచ్చేవాళ్ళకు రూ.9,200, రెండో కేటగిరిలో రూ.8,400 ఇచ్చేవాళ్లకు రూ.10,900, మూడో కేటగిరిలో రూ.11,600 ఇచ్చేవాళ్ళకు రూ.14,000 ఇవ్వాలని నిర్ణయించింది. 10వ వేతన సంఘం సిఫార్సుల అమలు తర్వాత రెగ్యులర్ ఉద్యోగుల జీతాలు 66 శాతానికిపైగా పెరిగాయి. అంతకాకున్నా కనీసం ఆయా పోస్టుల కనీస వేతన్ని అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులకు ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్‌ను పట్టించుకోని ప్రభుత్వం అందరికీ గంతగత్తుగా రూ.2,500 పెంచుతూ నిర్ణయం చేసింది. అలాగే ఈ నిర్ణయం యూనివర్సిటీలు, దేవాలయాలు, వివిధ ప్రభుత్వ పథకాలు, స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు వర్తిస్తుందా? వర్తించదా? అనేది స్పష్టం చేయలేదు. దీనిపై కార్మికులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
ఇదిలావుంచితే స్వయం ప్రతిపత్తి కలిగిన ధార్మిక సంస్థగా ఉన్న తితిదే, ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేస్తుందా లేదా అనేది చర్చనీయాంశంగా ఉంది. పాలకమండలి ఆమోదంతో ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయడాఆనికి అవకాశముంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60యేళ్ళకు పెంచినప్పుడు దాన్ని తితిదే కూడా అమలు చేసింది. అదే తరహాలో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికుల వేతనాలపైనా తితిదే నిర్ణయం తీసుకుంటుందని ఆశగా ఉన్నారు. ఇంకా ప్రభుత్వ జిఓల కిందకు రాని కాంట్రాక్టు ఉద్యోగులు కూడా తితిదేలో ఉన్నారు. ఇలాంటి అన్ని అంశాలలపైనా చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం ఆసన్నమైంది.
త్వరలో జరుగనున్న తితిదే పాలకమండలి సమావేశంలో కాంట్రాక్టు కార్మికుల వేతనాలపై ఒక నిర్ణయం తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేకుంటే ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్థమవుతున్నాయి. కాంట్రాక్టు కార్మికులు ఒకవేళ ఆందోళన చేపట్టి విధులను బహిష్కరిస్తే తిరుమల, తిరుపతి మొత్తం అపరిశుభ్రంగా మారక తప్పదు.