ఆ దేవత అనుగ్రహం పొందాలంటే కచ్చితంగా దొంగతనం చేయాల్సిందే..

మంగళవారం, 26 మార్చి 2019 (15:36 IST)
ఆలయంలో దొంగతనం జరిగితే ఏదో అరిష్టం అని చాలా మంది భావిస్తారు. గుళ్లలో దొంగతనాలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తారు. కానీ ఓ ఆలయంలోని దేవత అనుగ్రహం పొందాలంటే ఖచ్చితంగా దొంగతనం చేయాల్సిందే. దొంగతనం చేసిన వ్యక్తికి ఎవరూ అడ్డు చెప్పరు. పైగా అక్కడి పూజారే దొంగతనం చేయడానికి ప్రోత్సహిస్తాడు. 
 
ఆ వింత ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రూర్కీ జిల్లాలోని చూడియాలాలో ఉంది. దాని పేరు చూడామణి ఆలయం. ఇక్కడ దొంగతనం చేయాల్సింది నగలు, డబ్బు కాదు. దేవత పాదాల దగ్గర ఉండే చెక్క బొమ్మ. అతి పురాతనమైన ఈ ఆలయానికి ఎంతో మంది భక్తులు విచ్చేస్తారు. ముఖ్యంగా సంతానం లేని వారు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. దీనికి సంతాన ఆలయం అని కూడా పేరు ఉంది. 
 
ఆలయాన్ని సందర్శించిన వారికి తప్పకుండా పిల్లలు పుడతారని నమ్మకం. ఈ నమ్మకమే దానికి అంతటి గుర్తింపు తెచ్చింది. ఇక్కడ దొంగతనం చేసే ఆచారానికి పురాణ గాధ ఉందని స్థానికులు చెబుతుంటారు. లాందౌరా రాజు ఒకనాడు వేటకై అడవిలో వెళుతున్నప్పుడు చూడామణి ఆలయం కనిపించింది. ఆలయం వద్దకు వెళ్లి తనకు సంతాన ప్రాప్తి కలిగించమని వేడుకుంటాడు. 
 
దేవి మాయపై చెక్క బొమ్మ రూపంలో దర్శనమిస్తుంది. అప్పుడు ఆ రాజు చెక్క బొమ్మను తీసుకుని వెళ్లిపోతాడు. రాణి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ చెక్క బొమ్మను తీసుకువచ్చి యధాస్థానంలో ఉంచుతాడు. అప్పటి నుండి ఈ ఆచారం కొనసాగుతోందని చెబుతారు. ఆచారం ప్రకారం చెక్క బొమ్మను ఎత్తుకు వెళ్లిన వారు పిల్లలు పుడితే తిరిగి ఆ బొమ్మను తీసుకువచ్చి అక్కడ పెట్టేయాలి. మరో బొమ్మను కూడా అక్కడకు తీసుకువచ్చి ఉంచాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు