శ్రీవారి భక్తుల కోసం వాట్సప్ నెంబర్ రెడీ.... 939 939 939 9
శనివారం, 23 జులై 2016 (12:00 IST)
ప్రపంచ నలుమూలల నుంచి తిరుమలకు వచ్చే భక్తుల కోసం తితిదే వాట్సాప్ నెంబర్‌ను ప్రవేశపెట్టింది. తిరుమలలో భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా వాట్సాప్ నెంబర్‌కు పంపించే అవకాశాన్ని తితిదే కల్పిస్తోంది. తితిదే ఈఓ సాంబశివరావు ప్రత్యేకంగా వాట్సాప్ నెంబర్‌లో సమస్యలను తెలిసే అవకాశాన్ని భక్తులకు కల్పిస్తున్నారు. ఈఓ తీసుకున్న నిర్ణయంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తిరుమలకు ప్రతిరోజు 50 నుంచి 70వేల మంది భక్తులు తిరుమలకు వచ్చి వెళుతుంటారు. తిరుమలకు వచ్చే భక్తుల్లో సామాన్యులే ఎక్కువ మంది ఉంటారు. అయితే వారు వివిధ రకాల సమస్యలను తిరుమలలో ఎదుర్కొంటున్నారు. భక్తులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాలంటే అది ఎంతో కష్టమైన పని. తితిదే ఈఓ కానీ ఇద్దరు జెఈఓకు కానీ ఎప్పుడు ఎక్కడ ఉంటారో వారికే తెలియని పరిస్థితి.
గత కొన్నిరోజుల ముందు తిరుమలలో జరిగిన డయల్ యువర్ ఈఓ కార్యక్రమంలో ఇదే విషయాన్ని ఒక భక్తుడు ఈఓ దృష్టికి తీసుకెళ్ళాడు. దీనిపై వెంటనే స్పందించిన ఈఓ ఒక నెంబర్‌ను కూడా చెప్పారు. ఆ నెంబరే 939 939 939 9. ఈ నెంబర్ విన్న భక్తుడు ఆనందంతో సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఈఓ చెప్పినా సరే ఆ తర్వాత చాలారోజులకు ఆ నెంబర్ కాస్త వాట్సాప్‌కు యాక్టివ్ అయ్యింది. ప్రస్తుతం కొంతమంది భక్తులు మాత్రమే తాము ఎదుర్కొంటున్న సమస్యలను పంపుతున్నారు.
అయితే చాలా మంది భక్తులకు ఈ నెంబర్ తెలియదు. అందుకే తిరుమలలో అక్కడక్కడా పెద్ద పెద్ద బోర్డుల్లో వాట్సాప్ నెంబరును ప్రదర్శించి, ఫిర్యాదులను, సూచనలు ఆ నెంబరుకు పంపమని కోరితే ఉపయోగకరంగా ఉంటుంది. వాట్సాప్ వల్ల ఫోటోలు, వీడియోలు సులభంగా అప్‌లోడ్ చేసే అవకాశం ఉంటుంది.
ఉదాహరణకు అద్దెగదులను శుభ్రంగా లేదనుకుంటే ఫోటో చేసి వ్యాట్సాప్‌లో పంపుతారు. ఇంకో చోట ఏదైనా అసౌకర్యం కలిగితే తమ వాహనంలో వెళుతూనో లేక రైలులో ప్రయాణిస్తూనో తమ ఫిర్యాదును వాట్సాప్ ద్వారా పంపగలరు. తితిదే సేవలపై భక్తుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు అనేక సర్వేలు నిర్వహిస్తుంటారు. దాని ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటుంటారు.
అలాంటి ఫీడ్ బ్యాక్ వాట్సాప్ ద్వారా ఎక్కువగా వచ్చే అవకాశముంది. ఒక సదుపాయాన్ని అందుబాటులోకి తేవడం ఎంత ముఖ్యమైనదో, దాన్ని ఎవరు ఉపయోగించుకోవాలో వారికి సమాచారం తెలియజేయడమూ అంతే ముఖ్యం. అందుకే వాట్సాప్ నెంబరును తిరుమలలో విస్తృతంగా ప్రదర్సించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదిఏమైనా సమస్యలపై వాట్సాప్ నెంబర్‌ను ఏర్పాటు చేయడంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.