యశోదామాతే తిరుమల శ్రీనివాసుని తల్లి... శిథిలావస్థలో అమ్మవారి ఆలయం...
శుక్రవారం, 10 జూన్ 2016 (11:57 IST)
ఇది నిజంగా నిజమే... చిలిపి క్రిష్ణుని ఆలనాపాలనా చూసిన యశోదా దేవే తిరుమల వెంకన్నకు జన్మనిచ్చిన తల్లి. నమ్మశక్యం కాలేదు కదూ.. అయితే ఇది చూడండి...
ద్వాపరయుగం నాటి కథ ఇది. ఆ యుగంలో శ్రీ విష్ణు భగవానుడు శ్రీకృష్ణునిగా అవతరించాడు. పొత్తిళ్ళ నుంచి శ్రీకృష్ణుడిని పెంచి పోషించిన మాతృమూర్తి యశోదాదేవి. బాల్యం నుంచి శ్రీకృష్ణుడిని కంటికి రెప్పలా రక్షిస్తూ పెంచి పెద్ద చేసింది. చిన్నప్పటి నుంచి ఎందరో రాక్షసులనను సంహరించిన లీలల్ని, మహిమల్ని కనులారా చూసి ఆనందించింది యశోదాదేవి. అయినా యశోదకు తనివి తీరలేదు. శ్రీకృష్ణుడు సాక్షాత్ భగవంతుడే అని తెలియని యశోద రాక్షసుల వల్ల శ్రీకృష్ణుడినికి ఎక్కడ కీడు కలుగుతుందోనని మనసు తల్లడిల్లేదని పురాణాలు చెబుతున్నాయి. పుత్ర ప్రేమతో తన చిన్ని కన్నయ్యకు ఎక్కడ ఏ ఆపద కలుగుతుందోనని నిరంతరం బాధలు పడుతూ అష్టకష్టాలు పడి పెంచి పెద్ద చేసింది.
కానీ కంసుని వధానంతరం ఆ శ్రీకృష్ణుడు తల్లిదండ్రులైన దేవకీ వాసుదేవులతో చేరారు. వారి దగ్గరే ఆయనకు వివాహాది కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. చిన్నప్పటి నుంచి పెంచి పెద్దచేసిన తాను శ్రీకృష్ణుడికి వివాహాన్ని స్వయంగా చేసి సంతోషించే భాగ్యానికి నోచుకోలేదు కదా.! అని చింతిస్తున్న యశోదమాత మనస్సును తెలుసుకున్న శ్రీకృష్ణ పరమాత్మ.. అమ్మా నీవు ఏ మాత్రం చింతించవలసిన పనిలేదని భరోసా ఇచ్చాడు.
మాతృమూర్తివి బాధపడితే ఈ శ్రీకృష్ణుడికి మనుగడే లేదంటూ యశోదాను ఓదార్చాడు. నన్ను పెంచి పోషించినందుకు స్వయంగా నీవే నాకు వివాహాన్ని చేసి సంతోషించే భాగ్యాన్ని కలిగిస్తున్నానంటూ అభయమిచ్చాడు. అది ఈ ద్వాపరయుగంలో కాదు. తర్వాత వచ్చే కలియుగంలో అని చెప్పారు శ్రీకృష్ణుడు.
శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా కలియుగంలో యశోదాదేవి వకుళామాతలా వేంకటాచల శిఖరాలపై యోగినిగా తపస్సు ఆచరిస్తుండగా శ్రీవారు ప్రత్యక్షమయ్యారు. అలా స్వామివారి ఆలనాపాలనా చూసిన వకుళామాత పద్మావతి దేవిని ఇచ్చి స్వయంగా వివాహం చేసింది. అలా యశోదాదేవి కలియుగంలో వకుళామాతలా మారింది. తిరుమలకు వచ్చే భక్తులను ఎవర్ని అడిగినా వకుళామాత అంటే ఎవరో తెలియదంటారు.. ప్రతి ఒక్కరికి తెలిసింది గోవిందుడు ఒక్కడే.
అయితే భక్తులకు వకుళామాత చరిత్ర తెలియకపోవడానికి ఒక ప్రధాన కారణం ఉంది. తితిదే నిర్లక్ష్యమే వకుళామాత ఆలయం శిథిలావస్థకు చేరేలా చేస్తోంది. గత కొన్ని సంవత్సరాలకు ముందు వకుళామాత ఆలయంలో గంట కొట్టిన తర్వాతనే శ్రీవారికి నైవేథ్యం పెట్టేవారని ప్రసిద్థి. తిరుపతిలోని పేరూరు కొండపై వకుళామాత ఆలయం ఉండేది. ఇక్కడ ఉన్న పెద్ద గంట కొడితే తిరుమల గిరులపై ఆ గంట వినబడేది. అలా ఎంతో చారిత్రక కట్టడం వకుళామాత ఆలయం. అలాంటి వకుళామాత ఆలయం ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. కనీసం విగ్రహం కూడా లేకుండా చేశారు స్థానికంగా ఉన్న గ్రామస్థులు.
వకుళామాత కొలువై ఉన్న పేరూరు బండపై ఎంతో విలువైన రాళ్లు ఉన్నాయి. వీటిపై కన్నుపడిన స్థానిక పేరూరు గ్రామస్థులు వాటిని కొట్టి కొట్టి చదును చేసేశారు. మొదటి నుంచి ఆలయాన్ని అభివృద్ధి చేయకుండా తితిదేతో పాటు దేవదాయశాఖ తాత్సారం చేస్తూ వస్తే చివరకు వకుళామాత ఆలయం వద్ద చిన్న రాళ్లే మిగిలాయి. చివరకు కొన్ని హిందూ ధార్మిక సంఘాల ఆందోళనతో తితిదే ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయానికి వచ్చాయి.
అయితే తితిదేపై కోర్టుకెక్కారు పేరూరు గ్రామస్థులు. తాము పేరూరు బండను నమ్ముకునే జీవిస్తున్నామని తితిదేపై కోర్టులో దావా వేశారు. ఇంకేముంది ఆ కేసు కాస్త ఇంకా కోర్టులో జరుగుతూనే ఉంది. దీంతో ఆలయ నిర్మాణం కాస్త ఆగిపోయింది. ప్రస్తుతం వకుళామాత ఆలయం మొత్తం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయింది. మందుబాబులు ఈ ప్రాంతంలోనే మద్యం సేవిస్తున్నారు. కోట్లాది మంది భక్తులు పూజించే తిరుమల వెంకన్నకు స్వయానా తల్లి వకుళామాత ఆలయం శిథిలావస్థకు చేరుకోవడం హిందూ ధార్మిక సంస్థ ప్రతినిధులను ఆగ్రహావేశాలకు గురిచేస్తోంది. ఇంత చరిత్ర కలిగిన వకుళామాత ఆలయం ఎప్పటికి అభివృద్థి చెందుతుందో వేచి చూడాల్సిందే.