మగపిల్లవాణ్ణి కలిగించే శక్తివంతమైన మందు.. ఇదిగో...

సోమవారం, 14 ఏప్రియల్ 2008 (18:31 IST)
WD
నేటి ఆధునిక కాలంలో చాలా కుటుంబాలు ఆడపిల్లలను మగపిల్లలతో సమానంగా చూసుకుంటున్నారు. అయితే కొన్ని కుటుంబాలు మాత్రం మగ పిల్లవాడు కావాల్సిందేనంటూ... అందుకోసం రకరకాల మార్గాలను ఆశ్రయిస్తుండటం గమనార్హం. వారి బలహీనతను సొమ్ముచేసుకుంటూ... కొందరు మోసగాళ్లు వారిని అనేక రకాలుగా దగా చేస్తున్నారు.

ఏదినిజం శీర్షికలో భాగంగా, మీ ముందు ఇటువంటి సమస్యను ఒకదాన్ని ఉంచబోతున్నాం. అదేమంటే... కేవలం మగపిల్లలను మాత్రమే పుట్టించగల శక్తివంతమైన ఔషధం తన వద్ద ఉందంటూ... దానిని సేవించినవారికి తప్పక మగ పిల్లవాడు కలుగుతాడంటూ నమ్మబలుకుతున్న ఓ వ్యక్తి గురించిన వివరాలు. పవన్ కుమార్ అజ్మేరా అని పిలువబడే ఆ వ్యక్తి ఆయుర్వేద వైద్యుడు. ఇంతవరకూ బాగానే ఉంది... అయితే అతను చెప్పేదేమంటే... తాను ఇచ్చే అద్భుతమైన ఆయుర్వేద ఔషధానికి లింగనిర్థారణ చేసే శక్తి వుందని చెప్పుకోవటం.
WD


ఇండోర్‌లోని గాంధీనగర్ వద్ద ఇతని క్లినిక్ ఉంది. ఇతని ప్రకటనలను మీరు ఈ ప్రాంతంలోని గోడలపై చూడవచ్చు. కనీసం ఒక కూతురునైనా కలిగి ఉన్న వారికే తాను మందులను ఇస్తాడట. తమ పాప జనన ధృవీకరణ పత్రాన్ని తల్లితండ్రులు తీసుకురావడం తప్పనిసరి. అతని వైద్యం ఫలితంగా దాదాపు 300 మందికిపైగా స్త్రీలు మగ బిడ్డలను పొందారని చెపుతున్నాడు. మగ పిల్లవాడిని పొందాలనుకునే స్త్రీలు పవన్ కుమార్ ఇచ్చే మందును పాలతో సేవించాల్సి ఉంటుంది.

తమ కుటుంబంలో మగ పిల్లాడు కావాలని బలంగా కోరుకుంటున్నవారు మన సమాజంలో చాలా మందే ఉన్నారు. ఈ క్రమంలో అతని ప్రకటనలను కొందరు పూర్తిగా నమ్ముతున్నారు. తమ సమస్య పరిష్కారానికి ఇక్కడికి వచ్చి చికిత్స చేయించుకున్న వారు ఈ చికిత్స వల్ల తమకు ప్రయోజనం కల్గడమే కాక మగ పిల్లవాడు పుట్టాడని చెబుతున్నారు. వారిలో ఒకరైన మోహినీ ఉపాధ్యాయ మాతో ఇలా చెప్పుకొచ్చింది. తనకు ఇంతకుముందే ఆడపిల్ల కలిగిందనీ... పవన్ కుమార్ ఔషధం గురించి తెలుసుకుని ఇక్కడికి వచ్చాననీ చెప్పింది. అంతేకాదు అతని వైద్యం అనంతరం తాను మగబిడ్డకు జన్మనిచ్చానంది.

పవన్ కుమార్ ప్రకటనను చాలామంది వైద్యులు కొట్టిపారేస్తున్నారు. చిన్నపిల్లల నిపుణుడు ముఖేష్ బిర్లా ఈ విషయమై వెబ్‌దునియాతో మాట్లాడుతూ ఈ ప్రకటనలు జనాన్ని మోసగించడానికి తప్ప మరెందుకూ పనికిరావని చెబుతున్నారు. శిశువు పుట్టకముందే లింగ నిర్ధారణ చేయడం శాస్త్రీయంగా సాధ్యం కాదని చెప్పారు.

WD
వైద్యుడు నమ్మినా నమ్మకపోయినా, పవన్ చేస్తున్న ఈ సోకాల్డ్ వైద్యం స్థానిక ప్రజల్లో బాగా పేరు పొందింది. చాలామంది ఇక్కడికి మగపిల్లాడికోసమే వస్తున్నారు. ఒకవైపు ఆడశిశువుల జననాల రేటు క్రమక్రమంగా తగ్గుతూ వస్తున్నప్పటికీ, చట్టవిరుద్ధమైన ఈ వైద్యుడి వ్యాపారాన్ని అడ్డగించేందుకు ఏ ఒక్కరూ సాహసించకపోవడం గమనార్హం. జననానికి ముందే లింగనిర్థారణ చేయించడం శిక్షార్హమైన నేరంగా భావిస్తున్న మన దేశంలో అటు ప్రజలూ ఇటు ప్రభుత్వమూ ఇలాంటి ఘటనల పట్ల ఎందుకు ఊరకుంటున్నారో అర్థంకాదు. ఇంతకూ మీరేమనుకుంటున్నారు.... దయచేసి మీ అభిప్రాయాలను మాకు రాయండి.