పాపాలలో మానసికం, వాచికం, కాయికం- అని మూడు రకాల పాపాలుంటాయని పెద్దలు చెప్పారు. మనసులో చెడ్డ ఆలోచనలు కలగటం, వేరే వాళ్ళకు చెడు కలగాలని కోరటం, ఇతరుల ప్రవర్తనను గురించి లేనిపోని ఊహలుచెయ్యటం, పరాయి ఆడవాళ్ళ గురించి చెడుగా ఆలోచించటం.. యివన్నీ మానసిక పాపాలు.
మనసులోకి వచ్చిన ఊహలన్నీ పైకి మట్లాడటం. పెద్దలను ఎదిరించి మాట్లాడటం. మహనీయులను వెక్కిరించటం. ఇతరులను గురించి చెడుగా ప్రచారం చెయ్యటం, నిందలు వెయ్యటం. ఎదుటి వాళ్ళను కఠినంగా తిట్టటం, బూతు మాటలు మాట్లాడటం. దారినపోయే ఆడ వాళ్ళను ఏదో అని వాగటం, అబద్ధాలాడటం, యివన్నీ వాచిక పాపాలు అంటే మాటలతో చేసే పాపాలు.
దొంగతనాలు చెయ్యటం, ఎదుటివారిని హింసించటం, జంతువులను పక్షులను కొట్టటం, పరాయి ఆడవాళ్ళ జోలికి పోవటం - యిలాంటివన్నీ కాయిక- అంటే శరీరంతో చేసే పాపాలు.
మనకు తెలియకుండాచేసే పాపాల్లో మానసిక పాపాలు, వాచిక పాపాలు ఎక్కువ, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. ఫలితం అనుభవింపక తప్పదు. తెలిసి ముట్టుకున్నా, తెలియక ముట్టుకున్నా నిప్పు కాలక మానదు కదా !