యాదగిరిలో నృసింహ జయంత్యుత్సవాలు ప్రారంభం

ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నృసింహ జయంత్యుత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం సాంప్రదాయ రీతిలో స్వస్తి వచనంతో ఈ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఆలయ మండపంలో వేదమంత్రాలు, మంగళవాయిద్యాలతో వైష్ణవ సంప్రదాయం ప్రకారం విశ్వక్సేనుడికి ఆరాధన జరిపారు.

ఈ ఉత్సవాల్లో మొదటి రోజైన బుధవారం శ్రీలక్ష్మి అమ్మవారికి లక్ష కుంకుమార్చన వైభవంగా జరిగింది. అదేవిధంగా జయంతి ఉత్సవాల్లో భాగంగా పాంచారాత్రగమ శాస్త్ర రీతిలో బుధవారం సాయంత్రం మత్సంహగ్రహణం, అంకురార్పణం, మంత్రపుష్పం కార్యక్రమాలను అర్చకులు ఘనంగా నిర్వహించారు.

ఇదిలా ఉంటే.. 8వ తేదీన (శుక్రవారం) శ్రీ నృసింహ జయంతి సందర్భంగా యాదగిరి గుట్టలో నిర్వహించే స్వామివారి శతఘటాభిషేకంలో ఉభయసేవలకు అవకాశం కల్పిస్తున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. శతఘటాభిషేకంలో 1,116 రుసుము చెల్లించి దంపతులు పాల్గొనవచ్చునని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు.

మరోవైపు.. ఆలయ ఉత్సవాలను పురస్కరించుకుని దేవాలయ పరిసరాలను మంత్ర జలాలతో శుద్ధి చేశారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు భారీ ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి