వైభవంగా శ్రీవారికి పవిత్ర మాలల సమర్పణ

FILE
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాల్లో రెండో రోజైన ఆదివారం పవిత్రమాలల కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.

ఉదయం ఆలయంలో యధావిధిగా ప్రభాత సేవలు పూర్తయిన అనంతరం ఉత్సవర్లను మండపానికి వేంచేపు చేశారు. ప్రత్యేక స్నపన తిరుమంజనం తర్వాత, తొలిరోజు ప్రతిష్టించిన పట్టుపవిత్ర మాలలను వెండి పళ్లాలలో ఉంచి మూలవర్లకు సమర్పించారు.

శాస్త్రోక్త కార్యక్రమాల అనంతరం స్వామివారికి కిరీటం, శంఖచక్రాలు, లక్ష్మీదేవీకి కటి, వరద హస్తాలు, పాదపద్మాలకు పవిత్ర మాలలను సమర్పించారు.

ఇలా పరివార దేవతలైన భోగ, ఉగ్ర, కొలువు శ్రీనివాసమూర్తులతో పాటు సీతారామలక్ష్మణులు, రుక్మిణీ శ్రీకృష్ణులు తదితర ఉత్సవమూర్తులకు పవిత్రమాలలను సమర్పించే కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. పవిత్రమాలల సమర్పణకు అనంతరం పవిత్రోత్సవ మండపంలో ఉభయనాంచారి సమేత మలయప్ప స్వామికి కళశాలకు, యజ్ఞగుండాలకు పవిత్రాన్ని అలంకరించి ధూపదీప నైవేద్యాది హారతులతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.

సాయంత్రం సర్వాలంకరణాభూషితుడైన శ్రీ వెంకన్న స్వామి తిరుమాడవీధుల్లో ఊరేగుతూ.. భక్తులకు దర్శనమిచ్చారు. ఇకపోతే.. మూడోరోజైన సోమవారం గృహస్థులకు బహుమానం అందజేయడం, మధ్యాహ్నం ఒంటి గంటకు విశేష సమర్పణ, సాయంత్రం నాలుగు గంటలకు మాడవీధుల్లో శ్రీవారి ఊరేగింపు, పూర్ణాహుతి, ఆరు గంటలకు హోమం, యాగశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారని తితిదే విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

వెబ్దునియా పై చదవండి