శివలింగం చుట్టూ నాగుపాము ప్రదక్షిణలు..!

కలియుగంలో వింతలు చోటుచేసుకుంటాయన్న పెద్దల మాటలు రోజు రోజుకు నిజమవుతూనే ఉన్నాయి. మొన్నమొన్నటి వరకు భక్తవరాహం శ్రీ వేంకటేశ్వరుని ఆలయాన్ని ప్రదక్షిణ చేసి అందరినీ ఆకట్టుకోగా... ఇటీవలే భక్తగరుడుడు అయ్యప్ప స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి వార్తల్లోకెక్కాడు.

తాజాగా సాక్షాత్తు ఈశ్వరుని కంఠాభరణం, మహావిష్ణువు పాన్పైన నాగేశ్వరుడు (నాగుపాము) ఒకటి ఏకంగా శివలింగం చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. ఈ అరుదైన సంఘటన ఎక్కడ జరిగిందంటే..? నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామంలో...!

కిసాన్‌నగర్‌లోని రాంమందిర్ వెనుకవైపు గల ఖాళీ ప్రదేశంలో ఉన్న పుట్టలో నుంచి గత డిసెంబర్ 24న శివలింగం బయటపడింది. దీంతో భక్తులు పరవశించి శివలింగాన్ని దర్శించేందుకు భారీ ఎత్తున తరలివస్తున్నారు. ఈ లింగానికి నిత్యం పూజ, నైవేద్య సమర్పణ జరిగేలా స్థానిక గ్రామ కమిటీ, యువకులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో.. శుక్రవారం ఈ ఆలయం వద్ద పుట్టలోంచి పాము ఒకటి బయటికి వచ్చి శివలింగం చుట్టూ ప్రదక్షిణలు చేసింది. కొంతమంది భక్తులు భయంతో దూరంగా పరిగెత్తగా ఓ యువకుడు తన వీడియో కెమెరాలో ఈ అరుదైన దృశ్యాన్ని బంధించాడు.

ఈ వార్త చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యాపించడంతో శనివారం కూడా ఆలయం వద్ద భక్తుల రద్దీ పెరిగింది. ఈ పాముకు భక్తులు పాలు, గ్రుడ్డు వంటివి నైవేద్యమిచ్చి, కర్పూర నీరాజనాలు సమర్పించుకుంటున్నారు.

వెబ్దునియా పై చదవండి