శ్రీవారి ఆభరణాలపై నివేదికను ముందే అందజేస్తాం!

FILE
కలియుగ ప్రత్యక్షదైవం, శ్రీ వెంకటేశ్వర స్వామికున్న మొత్తం ఆభరణాల వివరాలను ఈ నెల 20లోగా నివేదిక ద్వారా అందజేయాలని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది.

ఆపద మొక్కుల వాడికున్న మొత్తం ఆభరణాలెన్ని? అందులో తితిదే సొంతంగా తయారుచేయించినవెన్ని? భక్తులు విరాళంగా ఇచ్చినవెన్ని? బంగారు, వెండి డాలర్ల లెక్కలేంటి? వంటి ఇతరత్రా ఆస్తుల విలువలను నివేదికలో తెలియజేయాలంటూ.. హైకోర్టు ఆదేశించింది.

శ్రీ వెంకటేశ్వరస్వామికి ఉన్న విలువైన నగలను సంరక్షించాలని, ఆ నగల జాబితాను కోర్టుకు సమర్పించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని పురస్కరించుకుని కోర్టు సోమవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. నెల్లూరు జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బెజవాడ గోవిందరెడ్డి, డి.ఎస్. కంద తదితరులు ఈ వ్యాజ్యం వేశారు.

ఇదిలా ఉండగా.. హైకోర్టు ఆదేశం మేరకు శ్రీవారి ఆభరణాలకు సంబంధించిన నివేదికను హైకోర్టు నిర్దేశించిన గడువుకన్నా ముందే అందజేస్తామని తితిదే వెల్లడించింది. ఈ అంశంలో ఎలాంటి దాపరికం లేదని, ఆభరణాలకు సంబంధించి సమగ్రమైన లెక్కలున్నాయని తితిదే ఛైర్మన్ ఆదికేశవులు తెలిపారు.

ఈవో, ముఖ్యభద్రతాధికారి, ఎఫ్అండ్ సీఓలు ప్రతి ఏడాది వీటిని తనిఖీ చేస్తారని, ఆ నివేదిక కోసం కష్టపడాల్సిన అవసరం లేదని, ఎప్పుడు శ్రీవారి ఆభరణాల జాబితా సిద్ధంగా ఉంటుందని ఛైర్మన్ తెలియజేశారు.

వెబ్దునియా పై చదవండి