టిటిడి ఛైర్మన్‌గా సినీనటుడు మురళీమోహన్...? నాక్కావాలంటున్న బాలయ్య...?

శనివారం, 1 ఏప్రియల్ 2017 (12:26 IST)
ప్రస్తుత టిటిడి ఛైర్మన్ చదలవాడ క్రిష్ణమూర్తి పదవీ కాలం ముగుస్తోంది. ఇక మిగిలింది కేవలం ఒక నెల మాత్రమే. ఇంకేముంది ఆ పదవి కోసం పైరవీలు ప్రారంభమయ్యాయి. ఎవరికున్న పరిచయాలతో వారు బాబును ప్రదక్షిణం చేసుకోవడం ప్రారంభించారు. ఎవరెన్ని ప్రదక్షిణలు చేసినా చివరకు ఆ పదవి వరించేది సినీ నటుడు, రాజమండ్రి ఎంపి మురళీమోహన్‌కు మాత్రమేనంటున్నారు టిడిపి సీనియర్ నేతలు.
 
మురళీమోహన్ ముందు నుంచీ సున్నిత స్వభావుడు. వివాద రహితుడు. ఏ విషయంలోను అతిగా స్పందించడు. వేంకటేశ్వరస్వామి అంటే భక్తి. కనీసం రెండు నెలలకు ఒకసారైనా తిరుమలకు వచ్చి వెళుతుంటారు. ఆయన ఎంపీ కాకముందే చంద్రబాబును కలిసినప్పుడు టిటిడి ఛైర్మన్‌గా కొన్ని రోజులు పనిచేయాలన్న కోరికను తెలిపారట. అయితే అప్పట్లో అవకాశం లేకపోవడంతో చంద్రబాబు విని గమ్మునుండి పోయారు. అయితే ప్రస్తుతం ఆ అవకాశం ఉంది కాబట్టి మురళీమోహన్‌‌కే తరువాత ఎక్కువ అవకాశాలు ఉన్నాయని టిడిపి నేతలు అంటున్నారు. 
 
అంతేకాదు చదలవాడ తరువాత రాయపాటి సాంబశివరావుకు ఆ పదవి రావాల్సి ఉంది. అయితే ఈమధ్య కాలంలో బాబుతో రాయపాటికి మధ్య కొద్దిగా గ్యాప్ రావడంతో ఆయనకు పదవి లేనట్లేనని తేలిపోయింది. ఆసక్తి కలిగించే మరో అంశమేమిటంటే... తితిదే చైర్మన్ పదవి తనకొస్తే వెంకటేశ్వరుని సేవలో తరించిపోతానని ఈమధ్య బాలయ్య కూడా తన మనసులో మాటను బయటపెట్టినట్లు సమాచారం. మరి ఆ గోవిందుడు ఎవరికి ఆ పదవిని దక్కేట్లు చేస్తారో...?

వెబ్దునియా పై చదవండి