కొండంత జనం - రోడ్లపైనే అన్నీ ...!

ఆదివారం, 28 మే 2017 (08:50 IST)
తిరుమల భక్తులతో పోటెత్తింది. ఎక్కడ చూసినా భక్తులే.. భక్తులు. కాస్త జాగా కనిపిస్తే చాలు అక్కడే కూర్చుండిపోతున్నారు భక్తులు. వరుసగా సెలవులు. దాంతో పాటు ఆదివారం కావడంతో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. కంపార్టుమెంట్లు ఎక్కడికక్కడ నిండిపోయాయి. 3 కిలోమీటర్లకు పైగా క్యూలైన్లు బయటకు వచ్చేశాయి. దర్శనానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితిలో ఉంది టిటిడి. అంతేకాదు భక్తులకు వసతి కల్పిస్తామని హామీ ఇవ్వలేని పరిస్థితిల్లోకి వెళ్ళిపోయింది. ఎప్పటిలాగా టిటిడి చేతులెత్తేసింది. తమకేం సంబంధం లేనట్లు వ్యవహరిస్తోంది. 
 
భక్తులు గంటల తరబడి రోడ్లపైనే బైఠాయిస్తున్నారు. అన్నీ రోడ్లపైనే కానిచ్చేస్తున్నారు. అన్నీ ఫుల్ అంటూ ప్రతి చోటా బోర్డులు దర్శనమిస్తున్నాయి. చిన్న పిల్లలను తీసుకొచ్చిన వారి పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. వృద్ధులను తీసుకొచ్చిన వారి అగచాట్లు చెప్పనవసరం లేదు. కొండంత జనంతో కొండ కిటకిటలాడుతోంది. మరో మూడు, నాలుగురోజుల పాటు ఇలాగే ఉండే అవకాశం ఉందని టిటిడి అధికారులు చెబుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి