తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక ప్రతిరోజూ ఉదయం కూడా అల్పాహారం

గురువారం, 27 అక్టోబరు 2016 (14:33 IST)
ప్రపంచ నలుమూలల నుంచి తిరుమలకు వచ్చే వేంకటేశ్వరస్వామి వారి భక్తులకు ఉపయోగపడేలా తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త వినిపించింది. తితిదే ఆధ్వర్యంలో ఇప్పటి వరకు అందిస్తున్న ఉచిత భోజన సదుపాయంతో పాటు అల్పాహారాన్ని కూడా ఇచ్చేందుకు ఏర్పాటు చేసింది. శ్రీవారి ఆలయానికి దగ్గరలో ఉన్న వెంగమాంబ నిత్య అన్నప్రసాద సముదాయంలో భక్తులకు అల్పాహారాన్ని అందించే పథకానికి తితిదే ఈఓ సాంబశివరావు శ్రీకారం చుట్టారు.
 
భక్తులకు టిఫిన్‌ను పెట్టి ఈ పథకాన్ని లాంభనంగా ప్రారంభించారు. ప్రతిరోజూ ఉదయం పూట రెండుగంటలపాటు ఈ అల్పాహారాన్ని వడ్డిస్తారు. ఒకేసారి నాలుగు వేల మంది భక్తులకు అల్పాహారం అందించగల సామర్థ్యం ఉందని ఈఓ తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయంలో అన్నప్రసాదం ట్రస్టు కింద మొత్తం 700 కోట్ల రూపాయలకుపైగా డిపాజిట్లు ఉన్నందుకు భక్తులకు ఉపయోగపడే మరిన్ని సౌకర్యాలపై దృష్టిపెట్టనున్నట్లు సాంబశివరావు వెల్లడించారు. ఉదయాన్నే శ్రీవారిని దర్శనం చేసుకునే భక్తులకు ఉచిత అల్పాహార సదుపాయం చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి