తిరుమలలో ఎడతెరిపిలేని వర్షం.. శ్రీవారి భక్త కోటి కష్టాలు

మంగళవారం, 17 నవంబరు 2015 (12:44 IST)
ఎడతెరిపిలేని వర్షాలతో తిరుమల అతలాకుతలమైంది. దీంతో శ్రీవారి భక్తులు కోటి సమస్యలతో అష్టకష్టాలు పడుతున్నారు. తిరుమల ముఖద్వారం అలిపిరి నుంచి తిరుమల చేరేవరకు, తిరిగి అలిపిరి చెంతకు వెళ్లే వరకు కష్టాలు అడుగడుగునా ఎదురవుతున్నాయి. రెండో కనుమ రహదారి మరమ్మతులు కారణంగా అలిపిరి నుంచి తిరుమలకు చేరుకోవడానికి 2 గంటల సమయం తీసుకుంటోంది. తిరుమలలోకి అడుగుపెట్టగానే కుండపోత వర్షం స్వాగతించడంతో పాటు చలి గజగజ వణికిస్తోంది. వృద్ధులు తీవ్ర అసౌర్యానికి లోనవుతున్నారు. వానలో భక్తులు తడుస్తూనే రాకపోకలు సాగించాల్సి వస్తోంది. 
 
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా తిరుమలలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రత 21.7, కనిష్ట ఉష్ణోగ్రత 17.1గా నమోదైంది. వర్షపాతం కూడా 167 మిల్లీమీటర్లుగా ఉంది. కనుమ రహదారిలో అక్కడక్కడ కొండ చరియలు విరిగిపడుతున్నాయి. తితిదే సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ వెంటనే వాటిని తొలగించి ట్రాఫిక్‌ను స్వల్ప వ్యవధిలో పునరుద్ధరిస్తున్నారు. 
 
రెండో కనుమ రహదారిపై భాగంలో 4 కి.మీ. పొడవున్న మార్గాన్ని మరమ్మతులు కారణంగా మూసివేశారు. దీంతో 15 కి.మీ నుంచి మొదటి కనుమ రహదారి వైపునకు ట్రాఫిక్‌ మళ్లిస్తున్నారు. మోకాళ్లపర్వతం నుంచి తిరుమల వైపు రహదారిలో తిరుమల, తిరుపతి వైపునకు వెళ్లే వాహనాలకు వంతుల వారీగా అనుమతిస్తున్నారు. దీంతో ప్రయాణం గంటల తరబడి ఆలస్యమవుతోంది. శ్రీవారిమెట్టు కాలినడక మార్గాన్ని ఇంకా పునరుద్ధరించలేదు. ఈ మార్గం నిర్మానుష్యంగా కనిపిస్తోంది. 

వెబ్దునియా పై చదవండి