ఒంటిమిట్టలో కోదండరాముని బ్రహ్మోత్సవాలు... గంటా పట్టువస్త్రాలు... 20న బాబు వస్తారు...

శుక్రవారం, 15 ఏప్రియల్ 2016 (16:26 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం తాజాగా విలీనం చేసుకున్న కడపజిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీరామ నవమి రోజున టిటిడి బ్రహ్మోత్సవాలను టిటిడి ప్రారంభించింది. ఉదయం పాంచారత్ర ఆగమ శాస్త్ర బద్ధంగా గరుడపటాన్ని ప్రతిష్టించి శాస్త్రోక్తంగా ధ్వజారోహణ ఘట్టాన్ని పూర్తి చేశారు.
 
ధ్వజస్థంభానికి నవ కలశ పంచామృతాభిషేకం చేసి సకల దేవతలను, అష్టదిక్పాలనులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. ఆలయ ప్రధాన కంకణబట్టర్‌ శ్రీ రాజేష్‌ భట్టార్‌ ఆధ్వర్యంలో ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది.

కోదండరామునికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాల సమర్పణ
 
కడపజిల్లా ఒంటిమిట్టలోని కోదండరామునికి ఎపి ప్రభుత్వం తరపున మంత్రి గంటా శ్రీనివాసరావు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇటీవల కాలంలోనే ఈ ఆలయాన్ని టిటిడి విలీనం చేసుకుంది. ఎపిలోనే అతిపెద్ద కోదండరామాలయంగా ప్రస్తుతం ఒంటిమిట్ట దేవాలయం విరాజిల్లుతోంది. శ్రీరామనవమిరోజే టిటిడి బ్రహ్మోత్సవాలను సమర్పించింది. వేదపండితులు వేదమంత్రోచ్ఛారణల మధ్య మంత్రి పట్టువస్త్రాలను స్వామివారికి సమర్పించారు. 
 
ఈ సంధర్భంగా మంత్రి గంటా మీడియాతో మాట్లాడుతూ ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు టిటిడి విస్తృతంగా సంతృప్తికరమైన రీతిలో ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. భారతదేశంలో పురాతన, చారిత్రక ప్రాశస్త్యం గల ఆలయాల్లో ఇది ఒకటన్నారు. ఆలయంతో పాటు మాస్టర్‌ ప్లాన్‌ను అమలు చేస్తోందని చెప్పారు. ఏఫ్రిల్‌ 20వతేదీన రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణానికి రాష్ర్ట గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరవుతారని మంత్రి చెప్పారు.

వెబ్దునియా పై చదవండి