శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి 3న నిర్వహించే ఆర్జిత సేవలైన నిజపాద దర్శనం, కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, వసంతోత్సవం, సహస్త్రదీపాలంకార సేవలను తితిదే రద్దు చేసింది. అయితే సుప్రభాతం, తోమాల మరియు అర్చనలను ఏకాంతంలో నిర్వహిస్తారు. రథసప్తమి నాడు విశేష సంఖ్యలో విచ్చేసే భక్తుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వికలాంగులు, వయోవృద్థులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, దాతల ప్రత్యేక దర్శనాలను తితిదే రద్దు చేసింది. అదేవిధంగా ఫిబ్రవరి 2వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు కంపార్టుమెంట్‌లలో యాక్సెస్ కార్డుల జారీని నిలిపివేయనున్నారు.
ఈ విషయాన్ని భక్తులు గమనించి సహకరించాలని తితిదే విజ్ఞప్తి చేస్తోంది. రథసప్తమి పర్వదినాన స్వామివారు ఒకే రోజున ఏడు ప్రధాన వాహనాలపై ఊరేగే కారణంగా రథసప్తమి ఒకరోజు బ్రహ్మోత్సవాలు,ఉప బ్రహ్మోత్సవాలని కూడా వ్యవహరిస్తారు. 3వతేదీ ఉదయం 5.30 నుంచి 8 వరకు సూర్యప్రభవాహనం, ఉదయం 9గంటల నుంచి 10 గంటల వరకు చిన్నశేషవాహనం, ఉదయం 11గంటల నుంచి 2గంటల వరకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 2గంటల వరకు హనుమంతవాహ నం, మధ్యాహ్నం 2 నుంచి 3గంటల మధ్యలో చక్రస్నానం, సాయంత్రం 4 నుంచి 5గంటల మధ్య కల్పవృక్షవాహనం, సాయంత్రం 6 నుంచి 7గంటల మధ్య సర్వభూపాల వాహనం, రాత్రి 8 నుంచి 9గంటల మధ్య చంద్రప్రభ వాహనసేవలను తితిదే నిర్వహించనుంది.