వైకుంఠ క్యూ కాంప్లెక్సులో అన్నమయ్య కీర్తనలు.. మెరుగైన సౌకర్యాల కోసం

బుధవారం, 3 డిశెంబరు 2014 (20:30 IST)
తిరుమలలో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలను కల్పించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటుందనీ, ఇప్పుడు కూడా ప్రత్యేకమైన కమిటీని నియమించనున్నట్లు ఆ సంస్థ కార్యనిర్వహణాధికారి ఎంజి గోపాల్ తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్సులో అన్నమయ్య కీర్తనలు తిలకించే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. 

 
బుధవారం సాయంత్రం తిరుపతిలో వేంకటేశ్వరా యూనివర్శిటీలోని సెనేట్  హాలు జరిగిన ఆలయ ధర్మకర్తల మండలి నిర్వహణ అనే అంశంపై ఆపరేషనల్ రిసెర్చ్ సొసైటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భక్తుల కోసం తిరుపతి తిరుమల దేవస్థానం ఎప్పుడూ కొత్త కొత్త విధానాలను ప్రవేశపెడుతూనే ఉంటుందన్నారు. మరింత మెరుగైన సేవలు అందించడమే టీటీడీ ధ్యేయమన్నారు. 
 
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, సాధారణ రోజుల్లో, రద్దీ రోజుల్లో, పర్వదినాలలో సాధరణ భక్తుల ఇబ్బందులను తెలుసుకోవడానికి ఓ ప్రత్యేక కమిటీని నియమించనున్నట్లు వివరించారు. ఈ కమిటీ ఇటు భక్తుల నుంచి అభిప్రాయాలు సేకరించడంతోపాటు తమ వద్ద ఉన్న దత్తాంశాన్ని పరిశీలించి ఏ విధమైన చర్యలు తీసుకుంటే భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించగలమో యోచిస్తుందని చెప్పారు.
 
ఈ మధ్య కాలంలోనే బంగారు వాకిలి లోపల మూడు ఎత్తులతో భక్తులకు తోపులాట లేకుండా భగవంతుణ్ణి దర్శించుకునే విధానాన్ని ప్రవేశపెట్టామని చెప్పారు. అలాగే వైకుంఠం 1,2 కాంప్లెక్సులలో వేచి ఉన్న భక్తుల కోసం అన్నమయ్య సంకీర్తనలు తిలకించే విధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్, విసి రాజేంద్ర, నిపుణులు రామ్మోహన్ రావు, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి