తిరుమలలో మరోసారి చిరుత ప్రత్యక్షమైంది. అది కూడా హంపి మఠంకు సమీపంలోనే. మఠం వెనుక భాగాన శుక్రవారం మధ్యాహ్నం చిరుత కనిపించడంతో భయాందోళనకు గురైన భక్తులు గదుల్లోకి పరుగులు తీశారు. వెంటనే మఠం నిర్వాహకులు అటవీశాఖ, తితిదే అధికారులకు సమాచారం అందించారు.
చిరుత పది నిమిషాల పాటు మఠం వెనుక ఉన్న చెట్ల కింద సేదతీరుతూ కనిపించిందని భక్తులు చెబుతున్నారు. అయితే అటవీశాఖ సిబ్బంది ఆ ప్రాంతానికి వచ్చి చూడగా చిరుత కనిపించలేదు. చిరుత కనిపించకపోవడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికి ఎన్నోసార్లు చిరుతలు తిరుమలలో కనిపించాయి. తిరుమలలోని అటవీప్రాంతంలో నీళ్లు లేకపోవడంతో జనసంచారం ఉన్న ప్రాంతాల్లో చిరుతలు వస్తున్నట్లు అటవీశాఖాధికారులు చెబుతున్నారు.