శ్రీరామనవమి రోజున శ్రీరాముని సమర్పించే వడపప్పు, పానక నైవేద్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి పవిత్రమైన వడపప్పు, పానకాన్ని.. ఇకపై భద్రాచలంలో భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేయనున్నారు.
ఈ మేరకు వైదిక సిబ్బందితో ఆలయ ఈవో టి.రమేష్ బాబు చర్చలు సఫలం కాగా..ఈ కొత్త సంప్రదాయానికి శ్రీరామ నవమి నుంచి శ్రీకారం చుట్టనున్నారు. వచ్చే నెల 5న భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణం నిర్వహించి, అనంతరం భక్తులకు వడపప్పు, పానకం ప్రసాదంగా పంపిణీ చేయనున్నట్టు ఈవో తెలిపారు. శ్రీరామనవమి రోజున వీఐపీల దర్శనాన్ని ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు అనుమతించే యోచనలో ఉన్నట్లు తెలిపారు.