శిథిలమవుతున్న గొగ్గూరు శిల్ప సంపద

శిల్ప కళలకు మన దేశం పెట్టింది పేరు. ఇక్కడ ఎన్నో శిల్ప సౌందర్య రాశులు ఉన్నాయి. కాలక్రమంలో పాలకుల అశ్రద్ధ కారణంగా అవి శిథిలమై భూ గర్భంలో కలిసిపోతున్నాయి. ఎంతో విలువైన సంపద ఇలా కనుమరుగైపోతున్నా నాయకులు పట్టించుకోవడం లేదు. ఇందుకు మరో ఉదాహరణ కర్ణాటకలోని రాయచూర్ జిల్లా దేవదుర్గ తాలూకాలోని గొగ్గూరు శిల్ప సంపద.

ఇక్కడ సుమారు 100కి పైగా దేవాలయాలున్నాయి. ఈ దేవాలయాల్లో ఆకట్టుకనే శిల్ప సంపద తొణకిసలాడుతుంది. ప్రపంచ ఖ్యాతిని ఆర్జించిన హంపి శిల్ప సౌందర్యాన్ని పోలి ఉంటాయి. అయితే పాలకుల నిర్లక్ష్య వైఖరి కారణంగా అపురూపమైన ఆ శిల్ప సౌందర్యం శిథిలమవుతోంది. మరికొన్ని దేవాలయాలలోని శిల్పాలను స్థానిక ప్రజలు తమ గృహ నిర్మాణాలలో వినియోగించుకుంటున్నారు. కట్టడాలకు తెల్లటి సున్నాన్ని కొట్టి అంద విహీనంగా మారుస్తున్నారు.

ఈ ఆలయాలపై ఎందరో పిహెచ్‌డీలు చేసి డిగ్రీలు సంపాదించారు. కానీ వారు తమ అధ్యయనంలో తెలిపిన వివరాలు మరి ఇంకెంతో కాలం మన కళ్లముందు కనబడే స్థితి లేదు. చారిత్రక నిర్మాణాలు నేడు పశుశాలలుగా మారాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి