టిప్పుసుల్తాన్ రాజధాని నగరం శ్రీరంగపట్నం

శనివారం, 26 జులై 2008 (15:23 IST)
కర్నాటక రాష్ట్రంలోని శ్రీరంగపట్నం ఓ అద్భుత విహారస్థలంగా పేర్కొనవచ్చు. మైసూర్‌ను పాలించిన టిప్పుసుల్తాన్‌‌కు శ్రీరంగపట్నం రాజధాని నగరం కావడం విశేషం. అటు పర్యాటక కేంద్రంగా ఇటు శ్రీరంగనాథుడు కొలువైన క్షేత్రంగా శ్రీరంగపట్నం పర్యాటకులతో నిత్యం కళకళలాడుతుంటుంది.

శ్రీరంగపట్నంలో చూడదగ్గ ప్రదేశాలు రెండు రకాలుగా విభజించవచ్చు. అవి విహార స్థలాలు, దేవాలయాలు.

శ్రీరంగపట్నంలోని విహార స్థలాలు
టిప్పుసుల్తాన్ పాలనలో రాజభవనంగా వెలుగొందిన కోట తొలుత చూడదగ్గ ప్రదేశము. అలనాడు టిప్పుసుల్తాన్ పాలనను నేడు మన కనులకు చూపించేందుకు ఈ కోట ఇంకా చెక్కు చెదరకుండా దర్జాగా నిలుచుని ఉంది. కోటలోకి ప్రవేశిస్తే ఆనాటి అద్భుత కళాఖండాలు మనకళ్లముందు సాక్షాత్కరిస్తాయి.

దాదాపు అర్థరోజుపాటు ఈ కోటలోని విశేషాలను తనివితీరా చూచి ఆనందించవచ్చు. దీని తర్వాత చూడదగ్గ ప్రదేశంగా జామా మసీదును పేర్కొనవచ్చు. టిప్పుసుల్తాన్ పాలనలోనే కట్టబడిన ఈ చారిత్రక కట్టడం అద్భుతంగా ఉంటుంది. శ్రీరంగపట్నాన్ని సందర్శించినపుడు దీని చూడడం మర్చిపోకండి.

దీని తర్వాత టిప్పుసుల్తాన్ వేసవి విడిది కోసం కట్టబడిన కోట కూడా చూడాల్సిన ఓ ప్రదేశం. ఈ కోట మొత్తం చెక్కతోనే కట్టబడి ఉండడం విశేషం. ఈ కోటలో టిప్పుసుల్తాన్, హైదరాలీలకు సంబంధించిన విశేషాలను తెలిపే తైలవర్ణ చిత్రాలు, అందమైన పెయింటింగ్‌లు చూచేవారి మనసును దోచేస్తాయి.


ప్రస్తుతం చెప్పిన ఈ ప్రదేశాలను పూర్తిగా చుట్టి చూడాలంటే దాదాపు ఓరోజు పూర్తిగా కేటాయించాల్సిందే. అందుకే శ్రీరంగపట్నాన్ని సందర్శించాలంటే రెండురోజులను కేటాయించడం ఉత్తమం. తొలిరోజు కోటలకు సంబంధించిన విశేషాలను తిలకించి మరుసటిరోజు దేవాలయాలను సందర్శించవచ్చు.

శ్రీరంగపట్నంలోని దేవాలయాలు
శ్రీరంగపట్నం అనగానే గుర్తుకు వచ్చేది శ్రీరంగనాథుని ఆలయం. దీనితోపాటు శ్రీరాధామాథవుల దేవాలయం, 450 మెట్లను కల్గిన వెంకటరమణ ఆలయం మొదలుగునవి శ్రీరంగపట్నంలోని ముఖ్యమైన దేవాలయాలు. ఈ దేవాలయాల్లోని అద్భుతమైన శిల్పకళ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది.

దీనితోపాటు ఆధ్యాత్మిక వాతావరణానికి ప్రతిరూపాలుగా ఉండే ఈ ఆలయాలు మనసుకు ఉల్లాసంతో పాటు ప్రశాంతతను చేకూరుస్తాయి.

వసతి సౌకర్యాలు
కర్ణాటకలోని మైసూరుకు సమీపంలో ఉండే పర్యాటక కేంద్రం కావడం మూలంగా శ్రీరంగపట్నంలో వసతి సౌకర్యాలకు ఎలాంటి లోటు లేదు. అన్ని రకాలైన వసతి సౌకర్యాలు ఇక్కడ లభిస్తాయి. అలాగే ఇక్కడి ఉండే కావేరీ నదికి సమీపంలో ఉండే హోటల్‌లలో వసతి సౌకర్యాన్ని పొందితే నది సౌందర్యాన్ని సైతం వీక్షించవచ్చు.

రవాణా సౌకర్యాలు
శ్రీరంగపట్నంకు చేరడం చాలా సులభం. కర్ణాటక రాష్ట్ర రాజధాని నగరం బెంగుళూరు నగరం నుంచి దాదాపు 50 నిమిషాల ప్రయాణంతో శ్రీరంగపట్నం చేరుకోవచ్చు. దేశంలోని ఎక్కడి నుంచి శ్రీరంగపట్నంకు చేరుకోవాలన్నా మొదట బెంగుళూరు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి