గణతంత్ర భారతావనిలో రాష్ట్రపతి పాత్ర

శుక్రవారం, 25 జనవరి 2008 (13:06 IST)
FileFILE
భారత రాష్ట్రపతి దేశ ప్రథమ పౌరుడు. సర్వ సైన్యాధ్యక్షుడు. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి కార్యనిర్వాహక దేశాధినేత. ఐదేళ్ళ పాటు పదవీకాలంలో వుండే రాష్ట్రపతిని ఎలక్ట్రోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. ఇలా బాధ్యతలు చేపట్టే రాష్ట్రపతి తనకు సంక్రమించిన అధికారాలతో భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రకారం పార్లమెంటు ఉభయసభలను సమావేశపరుస్తారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు ఇతర న్యాయమూర్తులను నియమిస్తారు.

ఇంతటి ప్రాధాన్యతను సంతరించుకున్న రాష్ట్రపతి పీఠానికి పోటీ చేసే అభ్యర్థి భారత పౌరుడై వుండి, 35 సంవత్సరాల వయస్సు నిండి వుండాలి. అలాగే లోక్‌సభకు ఎన్నికయ్యే అభ్యర్థికి వుండాల్సిన అర్హతలు కలిగి వుండాలి. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టే వ్యక్తి చేత భారత రాజ్యాంగంలోని 60వ ఆర్టికల్ ప్రకారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

అలా బాధ్యతలు స్వీకరించిన రాష్ట్రపతికి వివిధ ఉన్నత పదవులను అలంకరించేవారి నియామకం చేసే అధికారం ఉంటుంది. లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సాధించిన పార్టీ నుంచి ప్రధానమంత్రిని, అతని సలహాలు, సూచనలపై మంత్రిమండలిని, భారత త్రివిధ దళాధిపతులను, రాష్ట్ర గవర్నర్లను, ముఖ్య కమీషన్ల ఛైర్మన్లను, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లను, అటార్నీ జనరల్, కంప్ట్రోరల్ ఆఫ్ ఆటార్నీ జనరల్, సుప్రీం, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో పాటు.. ఇతర న్యాయమూర్తులను నియమిస్తారు.

FileFILE
రాష్ట్రపతిగా నియమితులైన వ్యక్తికి నెలవేతనంతో పాటు ఉచిత బస, వసతి, వైద్య సదుపాయాలను కల్పిస్తారు. తన పదవీకాలానికి ముందే రాజీనామా చేయదలచిన పక్షంలో సదరు రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి సమర్పించవలసి వుంటుంది.

భారతదేశ సర్వసత్తాక ప్రజాస్వామ్య వ్యవస్థగా ఆవిర్భవించిన అనంతరం తొలి రాష్ట్రపతిగా డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈయన 1950 జనవరి 26వ తేదీ నుంచి 1962 మే 13వ తేదీ వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్ హస్సేన్, వివిగిరి, హిదయతుల్లా, ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్, బిడిజట్టి, నీలం సంజీవరెడ్డి, జ్ఞానీ జైల్‌సింగ్, ఆర్.వెంకట్రామన్, శంకర్‌దయాల్ శర్మా, కేఆర్.నారాయణ్, డాక్టర్ అబ్డుల్ కలాంలు భారత రాష్ట్రపతులుగా బాధ్యతలు నిర్వహించారు.

ఆ తర్వాత దేశ ప్రథమ పీఠాన్ని అధిరోహించిన మహిళగా ప్రతిభా పాటిల్ చరిత్ర సృష్టించారు. ఈమె గత 2007 జూలై 25వ తేదీ నుంచి ఆ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా రాజకీయేతర రంగం నుంచి రాష్ట్రపతి పీఠాన్ని అధిరోహించిన వ్యక్తిగా భారత అణు శాస్త్ర పితామహుడు డాక్టర్ అబ్దుల్ కలాం నిలిచారు. ఈయన కాలంలో రాష్ట్రపతి భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చి, దేశంలోని కోట్లాది మంది యువత హృదయాల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.