భారత పౌరుని ప్రాథమిక హక్కులు

FileFILE
భారతదేశంలో పుట్టే ప్రతి వ్యక్తికి దేశ పౌరవారస్వతం లభిస్తుంది. ప్రస్తుతం మన దేశంలో ఏక పౌరసత్వం అమలులో ఉంది. ఇది పుట్టుక వల్ల, వారసత్వం వల్ల, రిజిస్ట్రేషన్ వల్ల సంక్రమిస్తుంది. దేశంలో జన్మించే పౌరునికి ప్రాథమిక హక్కులు వర్తిస్తాయి. ఇవి భారత రాజ్యాంగంలోని మూడో భాగం నిబంధన 12 నుంచి 35లో ప్రాథమిక హక్కులను పేర్కొన్నారు.

ఆదిలో భారత పౌరునికి ఏడు ప్రాథమిక హక్కులు వుండేవి. అయితే.. 1978 సంవత్సరంలో జరిగిన 44వ రాజ్యాంగ సవరణలో ప్రాథమిక హక్కుల్లో ఒకటైన ఆస్తి హక్కును తొలగించారు. దీంతో.. ప్రస్తుతం ఆరు హక్కులు మాత్రమే అమలులో వున్నాయి. ఆరు ప్రాథమిక హక్కులు ఉన్నప్పటికీ.. ఒక్కొక్కదానిలో మరికొన్ని ఉప హక్కులు వున్నాయి. తమ హక్కులకు భంగం కలిగినట్టు దేశ పౌరుడు భావించిన పక్షంలో న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు.

1. సమానత్వపు హక్కు.
2. స్వాతంత్ర్యపు హక్కు.
3. మత స్వాతంత్ర్యపు హక్కు.
4. రాజ్యాంగ పరిహారపు హక్కు.
5. సాంస్కృతిక, విద్యా సంబంధమైన హక్కు.
6. దోపిడీని నిరోధించే హక్కు.

ప్రాథమిక హక్కులు ఎలా దేశ పౌరునికి వర్తిస్తాయే... అలాగే.. ప్రతి పౌరునికి కొన్ని ప్రాథమిక విధులు కూడా వున్నాయి. గత 1976లో చేపట్టిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పది ప్రాథమిక విధులను చేర్చారు. ఈ ప్రాథమిక విధుల ప్రకారం... ప్రతి భారత పౌరుడు జాతీయ పతాకాన్ని, భారత రాజ్యాంగాన్ని గౌరవించాల్సి వుంటుంది. జాతీయోద్యమాన్ని ఉత్తేజపరచిన ఉత్తమమహాత్ములను, వారి ఆశయాల సాధనకు పాటుపడాలి. దేశ రక్షణ కోసం కంకణబద్ధులై, అవసరమైతే రక్షణ సేవలో తమ విధులను నిర్వహించాల్సి వుంటుంది.

భారత జాతి సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించాల్సి వుంటుంది. అంతేకాకుండా.. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను కాపాడుతూ, దౌర్జన్యం, అన్యాయాలకు ఎదురొడ్డి నిలబడాలి. భారత పౌరుల మద్య స్నేహ సౌభ్రాతృత్వాల పెంపునకు పాటుపడాలి. వ్యక్తిగత సామాజిక వికాసానికి పాటుపడుతూ.. శాస్త్రీయ విజ్ఞానాభివృద్ధికి కృషి చేయాల్సి వుంటుంది.

వెబ్దునియా పై చదవండి