భారత రాజ్యాంగ నిర్మాత.. అంబేద్కర్

FileFILE
డాక్టర్ అంబేద్కర్.. భారత రాజ్యాంగ నిర్మాత. దేశంలో అస్పృశ్య నిర్మూలన కోసం మహోద్యమాన్నే చేపట్టి దేశ వ్యాప్తంగా వున్న దళితుల్లో సాంఘీక, విద్య, రాజకీయ చైతన్యాన్ని రగిలించిన మహోన్నత వ్యక్తి. ముఖ్యంగా.. భారత జాతీయ సాంఘీకోద్యమ చరిత్రలో డాక్టర్ అంబేద్కర్‌కి విశిష్టమైన స్థానం ఉంది. సమాజంలో మనిషికి, మనిషికి మధ్య ఉన్న తేడాలను రూపుమాపి, సర్వసమానత్వం కోసం కృషిచేసిన కారణజన్ముడు. 1891 ఏప్రిల్ 14న మహారాష్ట్రంలో "మహర్" అనే హరిజన తెగలో జన్మించిన అంబేద్కర్ చిన్నతనం నుంచే తెలివైన విద్యార్ధిగా పేరు తెచ్చుకున్నాడు.

అతని మేధాశక్తికి, సమయస్పూర్తికి ఉపాధ్యాయులు విస్తుపోతుండేవారు. ఇద్దరు ఉపాధ్యాయులు అతనికి కావలసిన పుస్తకాలను, బట్టలను ఉచితంగా ఇచ్చి, అతని బాగా ప్రోత్సాహించారు. ప్రాథమిక విద్య అనంతరం భీమ్ రావ్ 'సతారా' నుంచి బొంబాయికి మకాం మార్చాడు. ఒక సువర్ణ పండితుడి సహకారంతో బొంబాయి ఎలిఫిన్ష్టన్ హై స్కూల్లో చేరాడు. ఆ పండితుడు అతనికి అన్ని విషయాలలోనూ చక్కని సలహాలిస్తూ, అతనిలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించి, ఆత్మబలంతో ముందుకుపోవటానికి ప్రోత్సాహమిచ్చారు. ఆయన మీద గౌరవంతో తన పేరును అంబేద్కర్‌గా మార్చుకున్నాడు.

ఆ రోజుల్లో "అంటరానితనం" ఆయన్ను ఎంతగానే భాధించేది. ఇలాంటి తక్కువ కులంలో పుట్టినందుకు దురదృష్టవంతుడినని ఆయన ఏనాడూ బాధపడలేదు. ఈ వర్ణవ్యవస్థ కేవలం మానవుడు కల్పించినవే, కొందరు స్వార్ధపరులు కల్పించిన ఈ ఆచారాలు ఖండించాలి. అందరిలోనూ ఎర్రని రక్తమే ప్రవహిస్తుంది. ఎక్కువ, తక్కువ అనే భావం మనలో ఉండకూడదు. దీనిని ఒక ఉద్యమంగా చేపట్టాలి! అని మనసులో నిశ్చయించుకున్నాడు. కానీ అటువంటి కార్యక్రమం చేపట్టాలంటే ముందు చదువు ముఖ్యం. అందుచేత ఉన్నత విద్యనభ్యసించాలి అనుకున్నాడు.

ఆ పట్టుదలే అంబేద్కర్‌ను న్యాయశాస్త్రంలో డాక్టరేట్ పట్టాపుచ్చుకునేలా చేసింది. 1917లో పి.హెచ్.డి. పూర్తిచేసి, అక్కడ నుండి యూరపుఖండంలోని అన్ని ముఖ్య దేశాలు తిరిగి, అక్కడ రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేశాడు. 1920లో లండన్ వెళ్ళి అక్కడ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి డాక్టరేట్ తీసుకొని 1928లో బారిష్టరు పరీక్షలో ఉత్తీర్ణులై స్వదేశం తిరిగి వచ్చారు. సంఘంలో అస్పృశ్యులనే వారికి సరైన స్థానం లభించాలంటే, "విద్య, సంఘంలో ఆందోళన" అవసరం అని ఉద్భోధించి వారిలో చైతన్యం కలిగించి "బహిష్కృతి హితకారిణి సభ" అనే సంస్థను స్థాపించాడు.

మహాత్మాగాంధీ, అంబేద్కర్‌ను కలిసి అంటరాని వారి హక్కుల సాధనకై పోరాడుతానని హామీ ఇచ్చారు. ఈ అంటరానితనాన్ని రూపుమాపడానికి ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా సఫలీకృతులు కాలేదు. ఆ తర్వాత 1947లో భారతదేశానికి స్యాతంత్ర్యం లభించింది. గాంధీజీ కోరిక మేరకు అంబేద్కర్‌కు దేశ న్యాయ, కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత భారత రాజ్యాంగ పరిషత్తు నియమించిన రాజ్యాంగ రచనా సంఘానికి అంబేద్కర్‌ను అధ్యక్షునిగా నియమించారు.

అదే ఆయన జీవితంలో మహోజ్వల ఘటన చరిత్రలో శాశ్వతమైన స్థానాన్ని కల్పించి మహత్తరమైన మలుపు రాజ్యాంగ రచనలో హెచ్చుభారాన్ని స్వీకరించి, అస్పృశ్యతను శిక్షార్హమైన నేరంగా నిర్ణయిస్తూ ఒక సూత్రాన్ని చేర్చారు. సర్వసమానత్వంకోసం కృషి చేసి ముఖ్యంగా దళితుల ఉద్దరణకు పాటు పడిన రాజకీయ విద్యా సాంఘీక రంగాలలో వారికి సమాన హక్కులు కల్పించి వారి పాలిట దైవంగా అవతరించిన ఆ మహావ్యక్తి 1956 డిసెంబరు ఆరో తేదీన పరమదించారు.

వెబ్దునియా పై చదవండి