మాయదారి "మాజీ ప్రియురాలు".. మనసే లాగేస్తోందీ...

WD
ఇంటర్నెట్ పుణ్యమా అని ఇప్పుడు మాజీ ప్రియురాలు ఎక్కడుందో... ఏం చేస్తుందో తెలుసుకునే అవకాశం మాజీ ప్రియులకు లభిస్తోంది. కాలేజీ రోజుల్లో పీకల్లోతు ప్రేమలో పడి ఆనక ఏవో కారణాల వల్ల విడిపోయిన వారు, ఆ తర్వాత కొన్నాళ్లకు కొత్తగా ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలని తహతహలాడుతున్నారట.

పురుషులు తరచూ ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తున్న వివరాలను పరిశీలిస్తే.. ఈ విషయం వెల్లడైనట్లు అమెరికాకు చెందిన ఓ అధ్యయన బృందం వెల్లడించింది. ఈ వివరాలను ఒకసారి చూస్తే... సుమారు 9 శాతం పురుషులు తమ మాజీ ప్రియురాలి జీవితం ఎలా ఉందో తెలుసుకోవాలన్న కుతూహలంలో ఉంటున్నారట. 4 శాతం మంది తిరిగి తమ మాజీ ప్రియురాలితో రొమాన్స్ సాగించడానికి ఆసక్తి కనబరుస్తున్నారట.

20 శాతం మంది మాజీ ప్రియురాళ్లు తమ ప్రియుల వద్ద నుంచి వస్తున్న మెయిళ్లను పట్టించుకోకపోవడమే కాక, తమ మెయిల్ చిరునామాలు మార్చుకుని తప్పించుకుంటున్నారట.

మరో 4 శాతం మంది మాత్రం మాజీ ప్రియునితో సంభాషణలు సాగిస్తూ... టీనేజి వయసులో పంచుకున్న తీపిజ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారట. ఈక్రమంలో మాజీ ప్రియుల నుంచి తిరిగి రొమాన్స్ చేయాలన్న అభ్యర్థన వెలువడినప్పుడు మాత్రం... గతం గతః అని చెప్పేసి, కేవలం స్నేహితుల్లా ఉందామంటున్నారట.

ఇదిలావుంటే మాజీ ప్రియురాలి పేరును తమ ఇ-మెయిల్ పాస్‌వర్డ్‌గా పెట్టుకునే ప్రియులు సుమారు 60 శాతం ఉన్నట్లు వెల్లడైందట. కనుక నెట్ వీక్షకుల్లో 60 శాతం మంది ప్రేమ పక్షులని మనం అనుకోవాలా..? ఏమో...?

వెబ్దునియా పై చదవండి