ప్రేమంటే ఇదేరా... ప్రేమించుకుందాం రా... ఇంకా చూడండి...

శుక్రవారం, 2 నవంబరు 2018 (17:59 IST)
ఎవరెన్ని చెప్పినా, ఎంతమంది ప్రేమికులు ఆ ఆనందాన్ని అందుకున్నా దాని గొప్పదనం గురించి చెప్పేందుకు ఇంకా ఏదో మిగిలే ఉంటుంది.అందుకే ఈ లోకంలో ప్రేమ ఇంకా మనగలుగుతోంది. అదేసమయంలో ఎంత చెప్పినా ప్రేమకు సంబంధించిన గొప్పతనం ఇంకా మిగిలి ఉన్నట్టే... ప్రేమ గురించి ఎంత విన్నా అసలు ప్రేమంటే ఏమిటి అని ప్రశ్నించేవారూ ఎప్పుడూ ఉండనే ఉంటారు. 
 
ప్రేమ గురించి ఎంత తెలిసినా, ఎంత విన్నా దాని విషయంలో సమాజంలోని కొందరిలో ఇంకా వ్యతిరేక భావన కొనసాగుతూనే ఉంది అంటే అది కచ్చితంగా ప్రేమ పేరుతో కొన్నాళ్లు సహవాసం చేసి అటుపై విడిపోయిన ప్రేమికుల వల్లే. ప్రేమను గురించి అర్థం చేసుకోకుండానే తమ మధ్య కలిగిన వ్యామోహానికి ప్రేమ అనే అందమైన పేరు పెట్టేసుకుని తమ అవసరాలు తీరాక తమ మధ్య ఏర్పడిన బంధాన్ని తెంచుకునే వారివల్లే ఈ సమాజంలో కొన్నిసార్లు ప్రేమ దోషిగా నిలబడాల్సి వస్తోంది.
 
ఇలాంటి తరుణంలో అసలు ప్రేమ అంటే ఏమిటి అని తరచి చూస్తే సమాధానం చెప్పడం పెద్ద కష్టమైన పనేమీకాదు. కళ్లకు నచ్చినవారిని సొంతం చేసుకోవడానికి, వారితో సంబంధాన్ని కొనసాగించడానికి ఉపయోగపడేది కాదు ప్రేమంటే. అలాగే అవసరం కోసం, ఆర్థిక లాభం కోసం ఇతరులతో జీవిత బంధాన్ని ఏర్పరచుకోవాలనుకోవడం సైతం ప్రేమ కాదు. అసలు ఎదుటివారి నుంచి ఏదో ఒకటి ఆశించి, దానిని నెరవేర్చుకోవడం కోసం ప్రేమ అనే పేరుతో వారితో సంబంధాన్ని ఏర్పరుచుకోవడానికి పేరు అసలు ప్రేమ కాదు. 
 
మరి ప్రేమంటే ఏమిటి... అని ఒక్కసారి ఆలోచిస్తే సమాధానం లభించకపోదు. ఎవరికోసమైతే మనసు నిజంగా స్పందిస్తుందో వారికోసం ఏమైనా చేయగలగడమే ప్రేమంటే... అంతేకాదు అలా మనసుకు నచ్చినవారి నుంచి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా కేవలం వారి సుఖం కోసమే ఆలోచించగలగడమే నిజమైన ప్రేమంటే. అలాంటి ప్రేమ ఇద్దరి మధ్య ఏర్పడగలిగితే అప్పుడు మాత్రమే వారు నిజమైన ప్రేమికులవుతారు. 
 
అలాంటివారు మాత్రమే జీవితాంతం ప్రేమికులుగా జీవించగలుగుతారు. పైన చెప్పినట్టు మరీ అంతటి ఉన్నతమైన ప్రేమ కాకున్నా కనీసం ఎలాంటి స్వార్థం లేకుండా జీవితాంతం సదరు వ్యక్తిపై తనలో కలిగిన ప్రేమ భావన వాడిపోకుండా ఉంటుందని ఎవరైనా నిజంగా భావించగలిగితే అది కచ్చితంగా నిజమైన ప్రేమే. ఇలా నిజమైన ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే ప్రేమికులుగా ఒక్కసారి జీవితాన్ని ప్రారంభించినవారు అటుపై ఎప్పటికీ విడిపోకుండా కలిసి ఉండగలుగుతారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు