టాలీవుడ్‌కు చేదు జ్ఞాపకాలు మిగిల్చిన 2008

PNR

FileFILE
తెలుగు చలన చిత్ర పరిశ్రమ టాలీవుడ్‌కు 2008 సంవత్సరం పలు చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. వీరిలో కొందరు అకస్మిక మృతి చెందగా, మరికొందరు ఆత్మహత్యలు, ఇంకొందరు అనారోగ్య రీత్యా తుది శ్వాస విడిచారు. ఈ కోవలో తొలుత మృతి చెందిన వ్యక్తి తెలుగు వెండితెర అందాల నటుడు శోభన్ బాబు. మార్చి 20వ తేదీన గుండెపోటుతో మృతి చెందాడు.

చెన్నైలోని తన స్వగృహంలో జరిగిన ఈ సంఘటనతో ఇటు టాలీవుడ్ మాత్రమే కాకుండా.. కోలీవుడ్ సైతం శోకసముద్రంలో మునిగిపోయింది. ఆ తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు శిష్యుడి దర్శకుడు శోభన్ ఆత్మాహుతి చేసుకున్నాడు. ఈయన మృతి చెందిన నెలరోజుల్లోనే.. శోభన్ సోదరుడు, తెలుగు హాస్య నటుడు లక్ష్మీపతి కూడా గుండెపోటుతో మరణించాడు.

ఈ సంఘటనల నుంచి తేరుకోకముందే 'ప్రేమికుల రోజు' హీరో కుణాల్ ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ తర్వాత దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలోనే కాకుండా.. బాలీవుడ్‌లోనూ తనదైన చెరగని ముద్రను వేసుకున్న ప్రముఖ విలన్ రఘువరన్ గుండెపోటుతో మృతి చెందాడు. నాగార్జున హీరోగా, రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శివ చిత్రంలో విలన్ పాత్రకు సరికొత్త భాష్యం చెప్పిన రఘువరన్.. ఆ తర్వాత అన్ని భాషల్లోనూ తనదైన చెరగని ముద్ర వేశాడు.

ఈయన మార్చి 19వ తేదీన తనువు చాలించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్యపు జల్లులు కురిపించి సీనియర్ హాస్య నటి కల్పనారాయ్ అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ఈమె దాదాపు 430 చిత్రాల్లో నటించిన ఘనతను కొట్టేశారు. ఆ తర్వాత మరో హాస్య నటుడు మల్లిఖార్జున రావు రక్తసంబంధిత వ్యాధితో మరణించారు. ఈయన 'నాగమల్లి' చిత్రంతో వెండితెర కెరీర్‌ను ప్రారంభించిన ఈయన సుమారు 370 చిత్రాల్లో నటించారు.

తన కెమెరా పనితనంతో నటీనటులను మరింత అందంగా చూపించే ప్రఖ్యాత, సీనియర్ ఛాయాగ్రహకుడు వీఎస్‌ఆర్ స్వామి, ప్రముఖ నిర్మాత టి.త్రివిక్రమరావులు చెన్నయ్‌లో కన్నుమూశారు. ఇకపోతే ఎన్టీఆర్ నట వారసుడు బాలకృష్ణకు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హీరోగా గుర్తింపు తెచ్చిపెట్టిన నిర్మాత, భార్గవ్ ఆర్ట్స్ అధినేత ఎస్.గోపాల్ రెడ్డి చెన్నైలో అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. తన సొంత బ్యానర్ భార్గవ్ ఆర్ట్స్ పతాకంపై పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించి పెద్ద నిర్మాతల జాబితాలో పేరు సంపాదించాడు.

వెబ్దునియా పై చదవండి