భారత క్రీడావలోకం-2008

FileFILE
దేశ క్రీడా చరిత్రలో 2008 సంవత్సరం స్వర్ణాక్షరాలతో లిఖించదగినదిగా పేర్కొనవచ్చు. ఒక్క క్రికెట్‌లోనే కాకుండా.. బీజింగ్ ఒలింపిక్ పోటీల్లో మన క్రీడాకారులు అద్భుతంగా రాణించారు. అలాగే.. గోల్ఫ్, డెవిస్‌కప్ క్రీడల్లోనూ క్రీడాకారులు రాణించారు. ఈ ఏడాది దేశ క్రీడ రంగం సాధించిన జయాపజయాలను ఒకసారి పరిశీలిద్దాం.

జనవరి 19: పెర్త్‌టెస్ట్‌లో టీమ్ ఇండియా ప్రపంచ నెంబర వన్ ఆస్ట్రేలియా జట్టును వారి సొంత గడ్డపై ఓడించి 16 వరుస విజయాల పరంపరకు రికార్డుకు బ్రేక్‌వేసింది.

జనవరి 25: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపిఎల్‌)లో ఎనిమిది ఫ్రాంచైజీలకు జట్లను కేటాయించే వేలం పాటలు జరిగాయి.

ఫిబ్రవరి 10: భారత గోల్ఫర్‌ శివ్‌శంకర్‌ ప్రసాద్‌ చౌరాసియా 2.5 మిలియన్‌ డాలర్ల ఎమ్మార్‌-ఎంజిఎఫ్‌ గోల్ఫ్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.

ఫిబ్రవరి 20: ముగిసిన ఐపిఎల్‌లో ఆటగాళ్ల వేలం పాటల ప్రక్రియ. ఈ పాటల్లో ఇండియా సిమెంట్స్‌కు చెందిన చెన్నయ్‌ సూపర్‌కింగ్స్‌ జట్టు ధోనీని రూ.ఆరు కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత దక్కన్‌ ఛార్జర్స్‌ ఫ్రాంచైజీ ఆసీస్ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్‌ కోసం రూ.5.4 కోట్లు వెచ్చించింది.

ఫిబ్రవరి 23: ఇండియన్‌లీగ్‌ ఫుట్‌బాల్‌ టోర్నీని భారత జట్టు గెల్చుకుంది.

మార్చి 9: ఎనిమిది సార్లు స్వర్ణపతక విజేత భారత హాకీ జట్టు 80 ఏళ్లలో తొలిసారిగా ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయింది. చిలీలో జరిగిన అర్హత టోర్నీలో గ్రేట్‌ బ్రిటన్‌ చేతిలో 0-2 తేడాతో చిత్తుగా ఓడిపోయింది.

మార్చి 4: ఆస్ట్రేలియాతో జరిగిన కామన్వెల్త్‌ బ్యాంక్‌ ముక్కోణపు సిరీస్‌ను భారత్‌ గెల్చుకుంది. ఆసీస్‌ గడ్డపై భారత్‌కిదే తొలి ముక్కోణపు సిరీస్‌ గెలుపు.

ఏప్రిల్‌ 12: జపాన్‌ను ఓడించి డేవిస్‌కప్‌ వరల్డ్‌గ్రూప్‌ ప్లేఆఫ్‌కు భారత్‌ అర్హత సాధించింది.

ఏప్రిల్‌ 14: బీజింగ్‌లో జరిగిన షూటింగ్‌ ప్రపంచకప్‌లో హైదరాబాదీ గగన్‌నారంగ్‌ 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో కాంస్యపతకం సాధించి సరికొత్త రికార్డును సృష్టించాడు.

ఏప్రిల్‌ 18: ఎనిమిది జట్లతో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ అట్టహాసంగా ప్రారంభం.

ఏప్రిల్‌ 24: భారత మహిళల హాకీ జట్టు కూడా ఒలింపిక్స్‌కు అర్హత పొందడంలో విఫలం.

ఏప్రిల్‌ 28 భారత హాకీ జనరల్‌ సెక్రటరీ కె.జ్యోతికుమరన్‌ లంచం తీసుకుంటూ కెమెరాకు చిక్కిపోవడంతో హాకీ సమాఖ్యను భారత ఒలింపిక్‌ సంఘం రద్దు చేసింది.

మే 27: లెజెండరీ జర్మన్‌ గోల్‌ కీపర్‌ ఆలివర్‌ కాన్‌కు కోల్‌కతా సాల్ట్‌లేక్‌ స్టేడియంలో అద్భుత రీతిలో వీడ్కోలు లభించింది.

జూన్‌ 1: షేన్‌వార్న్‌ సారథ్యంలోని రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు ఆరంభ ఐపిఎల్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

జూన్‌ 8: జీవ్‌ మిల్కాసింగ్‌ బ్యాంక్‌ ఆస్ట్రియా గోల్ఫ్‌ ఓపెన్‌ను గెల్చుకున్నాడు. యూరోపియన్‌ టూర్‌లో అతనికిది మూడో టైటిల్‌.

జూలై 12: భారత ఫుట్‌బాల్‌ కెప్టెన్‌ బైచుంగ్‌ భూటియా మ్యూనిచ్‌లో జరిగిన ఓ స్నేహపూర్వక ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో కాకా, స్టీవెన్‌ గెరార్డ్‌, బఫోన్‌, వాన్‌ నిస్టెల్‌రాయ్‌, డ్రోగ్బావంటి అంతర్జాతీయ ఆటగాళ్లతో కలిసి ఆడి ఓ గోల్‌ కూడా చేశాడు.

జూన్‌ 15: బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌సిరీస్‌ సెమీఫైనల్‌కు చేరుకున్న తొలి క్రీడాకారిణిగా రికార్డు సాధించింది.

జూన్‌ 18: భారత షూటర్‌ రంజన్‌ సోథి బెల్‌గ్రేడ్‌‌లో జరిగిన వరల్డ్‌కప్‌ డబుల్‌ ట్రాప్‌లో స్వర్ణం గెల్చాడు. అలాగే హైదరాబాద్‌లో జరిగిన ఆసియా కప్‌ జూనియర్‌ హాకీలో భారత్‌ 3-2తో దక్షిణ కొరియాను ఓడించి టైటిల్‌ గెల్చుకుంది.

ఆగస్టు 10: యూఎస్‌ పిజిఎ చాంపియన్‌షిప్స్‌లో 9వ స్థానంలో నిలవడం ద్వారా జీవ్‌ మిల్కాసింగ్‌ చరిత్ర సృష్టించాడు. ఓ భారతీయ గోల్ఫర్‌ ఇంతకుముందెన్నడూ ఈ స్థాయిలో ఆడలేదు.

ఆగస్టు 11: షూటర్‌ అభినవ్‌ బింద్రా ఒలింపిక్స్‌ 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్‌ ఈవెంట్‌లో స్వర్ణం గెలిచి ఒలింపిక్‌ చరిత్రలో వ్యక్తిగత అంశంలో పసిడి గెల్చుకున్న తొలి భారతీయ ఆటగాడయ్యాడు.

ఆగస్టు 13: ఎఎఫ్‌సి ఛాలెంజ్‌ కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీని భారత్‌ గెల్చుకుంది. ఫైనల్లో తుర్క్‌మెనిస్తాన్‌ను 4-1తో ఓడించి 24 ఏళ్ల తర్వాత ఆసియాకప్‌కు అర్హత సాధించింది.

ఆగస్టు 20: రెజ్లర్‌ సుశీల్‌కుమార్‌ అనూహ్యంగా కుస్తీ పోటీల్లో కాంస్యం గెల్చుకున్నాడు. ఒలింపిక్ పోటీల్లో భారత్‌కు 56 ఏళ్ల తర్వాత కుస్తీలో ఇదే ఒలింపిక్‌ వ్యక్తిగత పతకం కావడం గమనార్హం.

ఆగస్టు 20: బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గాడు. భారత ఒలింపిక్‌ చరిత్రలో ఓ బాక్సర్‌ పతకం గెలవడం ఇదే తొలిసారి.

సెప్టెంబర్‌ 6: భారత్‌కు చెందిన పంకజ్‌ అద్వానీ తన గురువు గీత్‌ సేథీని ఓడించి ప్రపంచ బిలియర్డ్స్‌ టైటిల్‌ను గెల్చుకున్నాడు.

సెప్టెంబర్‌ 14: సైనా నెహ్వాల్‌ చైనీస్‌ తైపీ గ్రాండ్‌ ప్రీ బ్యాడ్మింటన్‌ టోర్నీని కైవసం చేసుకుంది.

సెప్టెంబర్‌ 26: ఆంధ్రప్రదేశ్‌ ఆటగాడు చేతన్‌ ఆనంద్‌ యోనెక్స్‌ చెక్‌ ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్‌ టైటిల్‌ను గెల్చుకున్నాడు.

అక్టోబర్‌ 5: చేతన్‌ ఆనంద్‌ బిట్స్‌బర్గర్‌ ఓపెన్‌ గ్రాండ్‌ ప్రీ బ్యాడ్మింటన్‌ టైటిల్‌ను గెల్చుకున్నాడు.

అక్టోబర్‌ 29: విశ్వనాథన్‌ ఆనంద్‌ 12గేమ్‌ల వరల్డ్‌ చెస్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.

నవంబర్‌ 2: టెస్ట్‌ సారథి అనిల్‌కుంబ్లే అంతర్జాతీయ టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

నవంబర్‌ 10: స్వదేశంలో నాగపూర్‌ టెస్టులో ఆస్ట్రేలియాను ఓడించిన భారత్.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 2-0 తేడాతో కైవసం చేసుకుంది.

నవంబర్‌ 10: మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు.

నవంబర్‌ 16: జీవ్‌ మిల్కాసింగ్‌ ఐదు మిలియన్‌ డాలర్ల బర్కిలీ సింగపూర్‌ ఓపెన్‌ గోల్ఫ్‌ టోర్నీ విజేతగా నిలిచాడు.

నవంబర్‌ 29: ఎంసి మేరీకామ్‌ వరుసగా నాలుగోసారి ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో టైటిల్‌ నెగ్గింది.

డిసెంబర్‌ 6: కోల్‌కతాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అర్జెంటీనా సాకర్‌ లెజెండ్‌ డీగో మారడోనాకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

డిసెంబర్‌ 13: ముంబైపై ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో ఆరంభ ట్వంటీ-20 ఛాంపియన్స్‌ లీగ్‌ రద్దయింది.

డిసెంబరు 15: చెన్నయ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలిటెస్టులో భారత జట్టు 387 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని చేధించింది.

డిసెంబరు 23: మొహాలీలో భారత్-ఇంగ్లండ్‌ మధ్య జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది.

వెబ్దునియా పై చదవండి