రాజకీయాల్లో రాజ్యాంగానికి పాతర

FileFILE
60 ఏళ్ల క్రితం వచ్చిన స్వాతంత్ర్యానికి గుర్తుగా సగర్వంగా రాసుకున్న “ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగానికి” రాజకీయాలు పాతర వేస్తుంటే చూడాల్సిన దుస్థితి నేడు ఏర్పడింది. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు భారతీయ సమాజంలో రక్షణ లభిస్తుందా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ప్రతి పౌరుడికి దేశంలో ఏ ప్రాంతంలోనైనా నివసించే హక్కు రాజ్యాంగం ద్వారా దఖలు పడిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో ఈ హక్కును కాలరాస్తున్న వైనాన్ని గత కొంతకాలంగా చూస్తూనే ఉన్నాం. సంచలనాల కోసం ఎంచుకున్న “జన్మభూమి సిద్ధాంతం”తో ఒక రాజకీయ పార్టీ రాజ్యాంగం కల్పించిన ఈ హక్కును బహిరంగంగానే సవాలు చేస్తోంది.

సమాజంలో బలహీనతలను రెచ్చగొడితే ఉత్పన్నమయ్యే పర్యవసానాలను వాణిజ్య రాజధానివాసులతో పాటు దేశ ప్రజలు కూడా చూస్తూనే ఉన్నారు. పౌరుల ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. అయితే ప్రభుత్వాల తీరుతెన్నులు ఓటు బ్యాంకు రాజకీయాల చుట్టూనే పరిభ్రమిస్తుండటం ఇక్కడ ప్రస్తావనార్హం.

ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలోనే చూస్తూ, రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తూ నాయకులు తమకు కూడా సామాజిక బాధ్యత ఉన్న సంగతి మరిచారు. ఒక పార్టీ స్వార్థ ప్రయోజనాల కోసం తెరపైకి తీసుకొచ్చిన "జన్మభూమి" (భూమి పుత్రులు) సిద్ధాంతాన్ని ఖండించాల్సిన మిగతా పార్టీలు, దీనిపై నామమాత్రపు ప్రకటనలతో సరిపుచ్చుకోవడం ఇందుకు నిదర్శనం. ఈ సిద్ధాంతాన్ని సమర్థిస్తున్న వారిలో మహారాష్ట్ర అధికార పార్టీల నేతలు కూడా లేకపోలేదు.

ఉత్తర భారతీయులు మహారాష్ట్రలో ఉండకూడనంత తప్పేమీ చేయలేదన్నది వాస్తవం. పొట్టకూటి కోసం ఏనాడో స్వరాష్ట్రాలను విడిచిపెట్టి ముంబయికి వలసవచ్చిన వారిని, ఇన్నేళ్ల తరువాత వేరుచేసి చూడటం ఎంతవరకు సమంజసం. దీని గురించి ఆలోచించే నేతలే కరువయ్యారు. గత కొన్నివారాలుగా ఉత్తర భారతీయులను లక్ష్యంగా చేసుకొని “రాజ్ థాక్రే” నేతృత్వంలోని “మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన” (ఎంఎన్ఎస్) కార్యకర్తలు దాడులు చేస్తున్నారు. ఇది మా రాష్ట్రం, ఇక్కడి అవకాశాలన్నీ మాకే కావాలి అనడంలో తప్పులేకపోవచ్చు.

మహారాష్ట్రీయులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తుంటే ఉత్తర భారతీయులెవరూ అభ్యంతరం వ్యక్తం చేయరనే సంగతి ఇక్కడ వారు గుర్తించాలి. స్వరాష్ట్రీయుల ప్రయోజనాల కోసం పాటుపడేందుకు అవసరమైన అధికారాలు, హక్కులు రాష్ట్ర ప్రభుత్వాలు కలిగివున్నాయి. ఇవన్నీ ఉండగా ఉత్తర భారతీయులు మహారాష్ట్రీయుల అవకాశాలను కొల్లగడతారనే భయం అనవసరం.

స్వార్థ రాజకీయాలకు బాధ్యులెవరు... బాధితులెవరు …?
ఈ రాష్ట్రంలో ఇటీవల తరచుగా తెరపైకివస్తున్న సంచలనాల గురించి మాట్లాడుకునే ముందు, వాటికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఎంఎన్ఎస్ కారణమనే సంగతి ఇక్కడ గుర్తించాలి. ఆ పార్టీ అధినేత రాజ్ థాక్రే ఇప్పుడొక ఫైర్‌బ్రాండ్ పొలిటిషియన్. శివసేన నుంచి బయటకొచ్చిన రాజ్ థాక్రే తన ఉనికిని చాటుకునేందుకు, ప్రజాకర్షణ కోసం జన్మభూమి సిద్ధాంతాన్ని ఆయుధంగా మలుచుకున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా ఉత్తర భారతీయులను లక్ష్యంగా చేసుకున్నారు.

FileFILE
వారిపై తన పార్టీ కార్యకర్తలు చేస్తున్న దాడులను సమర్థించారు. అక్టోబరు 19వ తేదీన ముంబయి శివారు ప్రాంతాల్లో రైల్వే బోర్డు పరీక్షలు జరుగుతున్న 13 కేంద్రాలపై ఎంఎన్ఎస్ కార్యకర్తలు దాడులు చేయడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు వచ్చిన ఉత్తర భారతీయ అభ్యర్థులను ఎంఎన్ఎస్ కార్యకర్తలు తరిమికొట్టారు.

స్థానికులకు అవకాశాలు తక్కువగా కల్పిస్తున్నారంటూ రైల్వే బోర్డు పరీక్షలకు వచ్చిన పర భాషీయులపై వారు దాడులు చేశారు. ఈ దాడులను ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాక్రే బహిరంగంగానే సమర్థించారు. పనిలోపనిగా దమ్ముంటే తనను అరెస్టు చేయాలని, తనను అరెస్టు చేస్తే రాష్ట్రం తగలబడుతుందని హెచ్చరించారు. ఈ దాడులను సమర్థించినందుకు పర్యవసానంగా రాజ్ థాక్రే అరెస్టయ్యారు.

జన్మభూమి సిద్ధాంతంతో ఆయన ఉద్దేశపూర్వకంగానో లేక అనుకోకుండానో సమాజంలోని బలహీనతలను రెచ్చగొట్టారు. రాజ్ థాక్రే, ఎంఎన్ఎస్ కార్యకర్తల ప్రమేయం లేకుండా ముంబయిలో ఇటీవల జరిగిన రెండు సంఘటనలు ఇందుకు నిదర్శనాలు. ఎంఎన్ఎస్ తెరపైకి తెచ్చిన జన్మభూమి సిద్ధాంతం వికృత రూపం దాల్చిందనడానికి బెస్ట్ బస్సు ఎన్‌కౌంటర్, ధరమ్ దేవ్ హత్య సజీవ సాక్ష్యాలుగా మిగిలాయి.

ముంబయి బెస్ట్ బస్సు ఎన్‌కౌంటర్:
రాహల్ రాజ్ (23) అనే బీహార్ యువకుడు ముంబయిలో అక్టోబరు 27న రాజ్ థాక్రేకు గట్టి సందేశం పంపాలనే ఆశయంతో బరితెగించాడు. ఎంఎన్ఎస్ కార్యకర్తలు ఉత్తర భారతీయులపై జరుగుతున్న దాడులకు ప్రతీకారంగా రాహుల్ రాజ్ తుపాకీ చేతబట్టి ముంబయిలో తిరిగే బెస్ట్ బస్సును హైజాక్ చేసేందుకు ప్రయత్నించాడు. బస్సులో నాలుగు రౌండ్లపాటు కాల్పులు జరిపాడు.

ముంబయిలో ఉంటున్న బీహారీలపై జరుగుతున్న ఆకృత్యాలకు ప్రతీకారంగా అతను ఈ చర్యకు పాల్పడ్డాడు. తూపాకీ విడిచిపెట్టమని చెప్పినా, పట్టించుకోకపోవడంతో ముంబయి పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో చివరకు రాహుల్ రాజ్ మృతి చెందాడు. రాజ్ థాక్రేను చంపుతానని కూడా ఈ యువకుడు హెచ్చరించినట్టు ఎన్‌కౌంటర్ జరిగిన బస్సులోని ప్రయాణికులు చెప్పారు.

ఈ మొత్తం వ్యవహారంలో ఒక వ్యక్తి తనతోటి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడనే సంగతి అవగతమవుతోంది. రాహుల్ రాజ్ ఎన్‌కౌంటర్‌పై అనంతరం బీహార్‌లోని అధికార, ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. రాజ్ థాకరేపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరపాలని కోరాయి. దీనివెనుక ఏదో మతలబు ఉందని ఆరోపించాయి. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం పోలీసులు వారి విధులను సమర్థవంతంగా నిర్వర్తించారని అభినందించింది.

తుపాకీ చేతబట్టి చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తే... వారికి తుపాకీతోనే సమాధానం లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వ జోక్యంతో ఎన్‌కౌంటర్‌పై విచారణ కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ యువకుడు సంఘవిద్రోహిగా మారడానికి మహారాష్ట్రలో జరుగుతున్న ఉత్తరాది వ్యతిరేక ఆందోళనే కారణమయిందనేది ఇక్కడ అందరికీ తెలియాల్సిన వాస్తవం.

స్థానిక రైలులో యూపీ కార్మికుడి హత్య:
ముంబయిలో రాహుల్ రాజ్ ఎన్‌‍కౌంటర్ జరిగిన తర్వాతి రోజే కొంత మంది మరాఠీలు స్థానిక రైలులో ధరందేవ్ రాయ్ (25) అనే యూపీ కార్మికుడిని కొట్టిచంపారు. ఉత్తరప్రదేశ్ వెళ్లేందుకు ముగ్గురు స్నేహితులతో కలసి స్థానిక రైలులో ముంబయి సెంట్రల్‌కు బయలుదేరిన ధరందేవ్ రాయ్ అనే వలస కార్మికుడు మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. కొందరు స్థానికులు ఇతడిని కొట్టిచంపడానికి కారణం.. అతను యూపీవాసి కావడమే.

కిటికీ పక్కసీట్లో కూర్చోవడంతో దేవ్‌ను, అతని ముగ్గురు మిత్రులను అదే రైలు ఎక్కిన కొందరు స్థానికులు, మొదట వారిచే సీట్లు ఖాళీ చేయించారు. మీరు యూపీ వాసులేనా అని ప్రశ్నించారు. అవుననడంతో స్థానికులు వారిని దూషించడం మొదలుపెట్టారు. అనంతరం వారిపై దాడి చేసి రైలు దిగిపోయారు. స్థానికుల దాడిలో దేవ్ స్పృహ కోల్పోయాడు. అనంతరం ఆస్పత్రికి తరలించగా, వైద్యులు దేవ్ అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు.

దేవ్ హత్య కూడా దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. మహారాష్ట్రేతరులకు విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ప్రభుత్వం రక్షణ కల్పించడం లేదని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకపడ్డాయి. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న విలాస్‌రావ్ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. రాజ్ థాక్రేకు మహారాష్ట్ర ప్రభుత్వం అపరిమిత స్వేచ్ఛ ఇచ్చిందని ఆరోపించాయి. ఈ అనర్థాలకు ఇదే కారణమని వ్యాఖ్యానించాయి.

అయితే స్థానికులమనే భావన ప్రజల్లోంచి రావడం ఈ ఘటన ద్వారా గమనించాలి. స్థానికేతరులనే కారణంతో కొందరు మహారాష్ట్రీయులు ఈ ఘాతకానికి పాల్పడ్డారు. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం దేవ్ హత్య విద్వేషపూరిత చర్య కాదని ప్రకటించింది. రాష్ట్రంలో హింసను అరికట్టేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్‌రావ్ కేంద్ర ప్రభుత్వానికి వివరణ ఇచ్చారు.

జన్మభూమి సిద్ధాంతం మిగిలిన రాష్ట్రాలకు పాకితే...
మహారాష్ట్ర సమాజంలో రాజుకుంటున్న స్థానికులు... స్థానికేతరులనే భావన క్రమంగా మిగిలిన రాష్ట్రాలకు కూడా వ్యాపిస్తే దేశంలో ఇటువంటి ఉదంతాలు, ఘాతుకాలు రోజూ చూడాల్సిన భయానక పరిస్థితి ఉత్పన్నమయ్యే అవకాశాలు లేకపోలేదు. మన దేశం “భిన్నత్వంలో ఏకత్వానికి” ప్రతీక. ఇలాంటి ఘటనలు మరికొన్ని పునరావృతం అయితే ఈ భావన చరిత్రలో కలిసిపోయే ప్రమాదం ఏర్పడుతుంది.

దేశంలోని అన్ని రాష్ట్రాలు... విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాలు, ఆచారవ్యవహారాలకు నెలవు. మా రాష్ట్రంలో మావారే ఉండాలి... అనే ప్రాంతీయవాదం అన్ని రాష్ట్రాలను తాకితే ఏర్పడే పరిణామాలు ఊహించడం సాధ్యంకాదు. దేశ సమైక్యత, సమగ్రతకు ఈ విధానం ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది. ఎంఎన్ఎస్ కార్యకర్తలు ఉత్తరాదివారిపై చేసిన దాడులకు నిరసనగా బీహార్ విద్యార్థి సంఘాలు పెద్దఎత్తున్న ఆందోళన దిగి విధ్వంసం సృష్టించాయి. విద్యార్థి ఆందోళనలతో బీహార్ కొన్నిరోజులపాటు రావణకాష్టంగా మారింది.

మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇటువంటి ఘటనలు జరిగితే, దేశం మొత్తం బీహార్ తరహాలోనే భగ్గుమంటుందని రాజకీయ నాయకులు తెలుసుకోవాలి. సమాజంలో విద్వేషాలు రగలకుండా చూడాలంటే, రాజకీయ నాయకులు చట్టాలు, రాజ్యాంగం కల్పించిన హక్కులను గౌరవించడం నేర్చుకోవాలి. రాజకీయ ప్రయోజనాలను పక్కనబెట్టి ప్రజల్లో సమైక్యత పెంపొందించేందుకు కృషి చేయాలి...