పిల్లలకు ఆశీస్సులను అందించే భోగి పళ్ళ వేడుక (భోగి పండుగ స్పెషల్)

మంగళవారం, 10 జనవరి 2017 (20:56 IST)
భోగి రోజున భోగి పళ్ళు పేరుతో రేగి పళ్ళను పిల్లల మీద పోస్తారు. రేగి చెట్టుకు బదరీ వృక్షం అనే సంస్కృతం పేరు. రేగి చెట్లు, రాగి పండ్లు శ్రీమన్నారాయణ స్వామి ప్రతి రూపం. ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన ఫలం. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపళ్ళతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. వాటిని తలపై పోయడం వలన శ్రీలక్ష్మీ నారాయణుల అనుగ్రహం పిల్లలపై ఉంటుందని, పిల్లలకి ఉన్న దిష్టి తొలగి పోయి వారి ఎదుగుదలకు తోడ్పడుతుందని మన పెద్దల విశ్వాసం. 
 
మన బాహ్య నేత్రాలకి కనిపించని బ్రహ్మ రంధ్రం మన తల పైభాగంలో ఉంటుంది. ఈ భోగి పండ్లను పోయి ఆ బ్రహ్మరంధ్రాన్ని ప్రేరేపితం చేస్తే, పిల్లలు జ్ఞానవంతులు అవుతారు. రేగు పండ్లు సూర్య కిరణాలలోని ప్రాణశక్తిని అధికంగా గ్రహించి, నిల్వ ఉంచుకుంటాయి కనుక వీటిని తల మీద పోయడం వలన వీటిలోని విద్యుచ్చక్తి, శరీరంపై, ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపించి మంచి ఫలితాలు ఇస్తాయి.
 
అందువలనే పిల్లలకి భోగి పండ్లు పోసి ఆశీస్సులు అందిస్తారు. మరికొంతమంది రేగి పళ్ళతో పాటు శనగలు, పూలు, నాణెములు(చిల్లర డబ్బులు), చెరకు గడలు, కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టిని తీస్తారు. భోగి పళ్ళు పేరంటానికి వచ్చిన వారికి తాంబూలాలతో పాటు పసుపు, కుంకుమలు పెట్టడం ఆనవాయితీ. ఈ కార్యక్రమంలో భాగంగా భోగినాడు సాయంత్రం కొందరు బొమ్మల కొలువును కూడా ఏర్పాటు చేస్తారు. దీనిలో పిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆటవస్తువులను ప్రదర్శనగా ఉంచి ఆనందిస్తారు.

వెబ్దునియా పై చదవండి