వార్తః కర్ణాటక శాసనసభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ అధికారానికి చేరువలో నిలవగా, జేడీఎస్ ఘోర పరాజయం పాలైంది. చెవాకుః ఎంత పని చేశారయ్యా మీ జనం దేవెగౌడ గారూ! ప్రజా క్షేమమే ధ్యేయంగా, మీ తనయుడిని సీఎంగా చేయడం ద్వారా మత తత్వ బీజేపీని అధికారంలోకి దూరంగా ఉంచాలనుకున్న మీ ఆశయాన్ని ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారేమో. అయినా వారితో అధికార భాగస్వామ్యం కోసం ఒప్పందం చేసుకున్నపుడు ఆ పార్టీ మతతత్వ పార్టీ అనే విషయం గుర్తుకు రాలేదా అని కూడా కొందరు గొణుగుతున్నారట. లోకానికేం పని ఉంది. మంచి చేసే వాడినే చీదరించుకుంటారని మీరు సరిపెట్టుకోవచ్చు. కానీ వారి గొణుగుడు కూడా కాస్త ఆలోచించదగిన విషయమే. ముందుగానే ఆలోచించి, వారిచ్చిన అధికార భాగాన్ని కొంత కాలమైనా అనుభవించి ఉంటే బాగుండేదేమో! ప్రజలకిపుడు తమ అభివృద్ధి, సంక్షేమం తప్ప లౌకిక వాదం, మతతత్వం గురించి ఆలోచించే తీరిక లేదనిపిస్తోంది. ఎలాగూ మీ తనయులిద్దరూ గెలిచారు కాబట్టి ఇకనైనా జాగ్రత్తలు తీసుకుంటే మంచిదనుకుంటున్నాం.