పరోక్ష ప్రచారమెందుకు స్వామీ?

వార్తః సోనియాగాంధీ ఆర్థిక సాయంతోనే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష పడిన నళినీ కుమార్తె లండన్‌లో చదువుతోందని జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్య స్వామి ఆరోపించారు. ఎస్ఎస్‌సీ పరీక్షలో ఉత్తీర్ణులైన సమయంలో నళినీ కుమార్తెకు అభినందనలు కూడా తెలిపారన్నారు.

చెవాకుః ఏం చేస్తున్నారు స్వామీ! మీ పేరు తరచూ ప్రచారంలో ఉండాలని మీరు కోరుకుంటున్నారనే విషయం అందరికీ తెలిసిందే. అంతమాత్రాన మీరు ఇప్పటివరకు బద్ధ శతృవుగా భావించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీపై మరింత సానుభూతి కలిగేలా వ్యాఖ్యలు చేస్తున్నారేమిటి? మీ ఉద్ధేశం అది కాకపోవచ్చు ఆ వ్యాఖ్యలు మాత్రం ఆమెకు మేలు కలిగించేవే. ఇప్పటికే నళినీని ప్రియాంకా జైలులో కలవడం ద్వారా గొప్ప మనసు చాటి చెప్పుకున్నారని జనం చెప్పుకుంటుండగా, నళినీ కుమార్తె చదువుకు కూడా సోనియా సాయం చేస్తున్నారనడం ఇంకెంత స్థాయికి వారి ఇమేజ్‌ను తీసుకెళ్లి పోతుందో చెప్పలేం. కష్టాల్లో చిక్కుకున్న కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను నీరు గార్చడమెందుకు? ఏంటో స్వామీ మీ అంతరంగం ఎవరికీ బోధపడదు.

వెబ్దునియా పై చదవండి