కదిలిపోయిన "న్యూజిలాండ్ దక్షిణ ద్వీపం"

న్యూజిలాండ్ పరిసర ప్రాంతాలలో గత వారం సంభవించిన భారీ భూకంపం ధాటికి న్యూజిలాండ్ దక్షిణ ద్వీపం ఆస్ట్రేలియాకు దగ్గరగా జరిగిపోయిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దక్షిణ ద్వీపం ఫియోర్డ్‌లాండ్ కేంద్రంగా సంభవించిన ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదైంది.

ఈ భారీ భూకంపం న్యూజిలాండ్ దక్షిణ ద్వీపం రూపురేఖలను మార్చివేయటమేగాక... దాన్ని ఆస్ట్రేలియా దేశానికి 30 సెంటీమీటర్ల మేరకు దగ్గరగా ముందుకు జరిపినట్లు పరిశోధకులు గుర్తించారు. న్యూజిలాండ్ "జియోనెట్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్" చిత్రాల ఆధారంగా వారు ఈ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఫియోర్డ్‌లాండ్ ప్రాంతంలోని టె అనావు పట్టణం ఆస్ట్రేలియాకు పది సెంటీమీటర్లు దగ్గరగా జరగగా.. బ్లఫ్ మూడు సెంటీమీటర్లు, అలెగ్జాండ్రా రెండు సెంటీమీటర్లు, డూనెడిన్ ఒక సెంటీమీటర్ చొప్పున ఆస్ట్రేలియాకు దగ్గరైనట్లు పరిశోధకులు తెలిపారు. కాగా.. న్యూజిలాండ్ దక్షిణ ద్వీపానికి, ఆస్ట్రేలియాకు మధ్య దూరం 2 వేల కిలోమీటర్లకు పైగానే ఉంటుంది.

ఇదిలా ఉంటే... భూమిపై ఖండాల స్వరూప స్వభావాలను భూకంపాలు మార్చివేశాయన్న శాస్త్రవేత్తల అంచనాలకు ఈ సంఘటనను ఓ సజీవ సాక్ష్యంగా పేర్కొనవచ్చు. న్యూజిలాండ్‌లో గత 78 సంవత్సరాలలో సంభవించిన అతి భారీ భూకంపం ఇదేనని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. దక్షిణ ద్వీపం భూకంపానికి ముందున్న స్థానానికి చేరుకునే అవకాశం ఉన్నా... ఇందుకు కొన్ని వందల సంవత్సరాల కాలం పట్టవచ్చునని పరిశోధకులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి