నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ పతనం

FILE
ట్రేడింగ్ బలహీనత కారణంగా బుధవారం బాంబే స్టాక్ మార్కెట్ పతనమైంది. ఈ వారం ప్రారంభం నుంచి లాభాలతో దూసుకెళ్లిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ బుధవారం కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొని లాభ, నష్టాలతో మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకుంది.

దీంతో బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 28 పాయింట్లు క్షీణించి, 17,169 పాయింట్ల మార్కు వద్ద నిలిచింది. కానీ నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ మాత్రం 1.25 పాయింట్లు లాభపడి, 5,123 పాయింట్ల వద్ద ముగిసింది.

దేశీయ వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురికావడం సెన్సెక్స్ పతనానికి ప్రధాన కారణమని స్టాక్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. అలాగే విదేశీ మార్కెట్ల ట్రేడింగ్ బలహీనత, అంతర్జాతీయ సూచీలు మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకోవడం వంటి కారణాలు సెన్సెక్స్ తిరోగమనం వైపు పయనించిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

బుధవారం స్టాక్ మార్కెట్ ర్యాలీలో ఎఫ్ఎంసీజీ, క్యాపిటల్ గూడ్స్, కంజ్యూమర్ డూరబుల్స్ వాటాల కొనుగోళ్లు పుంజుకోగా, ఐటీ, మెటల్, రియాల్టీ, ఆటో, బ్యాంక్, హెల్త్‌కేర్, ఆయిల్, గ్యాస్ వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి.

వెబ్దునియా పై చదవండి